పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన నిరసన, దాడిపై భగ్గుమన్న కవిత!
నాగార్జునసాగర్ పరిసర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినట్లు చెబుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రాజెక్టు పనులను నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన నేతలు ఆందోళనకు దిగిన సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొనడం, నేతలపై దాడి జరిగిందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టు పనుల తీరుపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతుండగా, క్షేత్రస్థాయిలో నిరసనలు తలెత్తడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
విజయపురి సౌత్ వద్ద సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలకు తాగునీరు అందించే పేరుతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారని చెప్తున్నారు. అయితే, ఇన్‌టేక్ వెల్‌ను జలాశయం డెడ్ స్టోరేజ్ స్థాయి 155.48 మీటర్లు కంటే తక్కువ ఎత్తులో 150.45 మీటర్ల వద్ద నిర్మించాలనే ప్రతిపాదనపై తెలంగాణ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB), అపెక్స్ కౌన్సిల్ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం, విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు, తాగునీటి అవసరాలపై ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రభావం చూపుతుందేమోనన్న సందేహాలు స్థానికంగా నెలకొన్నాయి.
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు కొంతకాలంగా సాగుతున్నా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో సమాచారం అందలేదన్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇరిగేషన్ అధికారులను వివరణలు కోరడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, నివేదికలు తెప్పించుకోవడం వంటి పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ట్రైబ్యునల్ పరిధిలోకి వస్తాయని, కొత్త ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను పాటించాల్సిందేనని కేఆర్‌ఎంబీ స్పష్టత ఇచ్చింది.
ఈ సమయంలో రక్షణ సేన తెలంగాణా రాష్ట్రానికి పల్నాడు వాటర్ గ్రిడ్ తో అన్యాయం జరుగుతుందని ఆందోళన చేసింది. అయితే అక్కడ వారి ఆందోళనను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వారిపైన దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఇరు వర్గాలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన తెలంగాణ రక్షణ సేన నాయకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై ప్రైవేట్ వ్యక్తులు దాడి చేయడం దారుణం అని కవిత అభిప్రాయపడ్డారు. ఆంధ్రకు అక్రమంగా నీటిని తరలించుకపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస సోయి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications
