పాకిస్తాన్ కు కేంద్రం బిగ్ చెక్- పీఓకేపై పార్లమెంట్ లో బిల్లు
డీలిమిటేషన్ బిల్లు సోమవారం లోక్ సభ సమక్షానికి రాబోతోన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. దాదాపుగా బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైనంత బలం దక్కిన నేపథ్యంలో.. ఆ తరువాతి పరిణామాలు, ఉభయసభల్లో ప్రస్తావనకు రాబోయే అంశాలపై విస్తృత స్థాయిలో మిత్రపక్షాలతో సంప్రదింపులుు మొదలుపెట్టింది. ఇప్పటికే బిల్లు ముసాయిదా కాపీలు కూడా సభ్యులకు అందజేసినట్లు తెలుస్తోంది.
ఈ డీలిమిటేషన్ తో పాటే మరో బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కు సంబంధించినది ఇది. పీఓకేలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనను ప్రస్తావించింది. డీలిమిటేషన్ (సెకెండ్) బిల్లులో ఈ మేరకు ఈ నిబంధనలను పొందుపరిచింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భూభాగం తిరిగి భారత నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అక్కడ శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను మార్చే సర్వాధికారాలు కూడా కేంద్రానికి సంక్రమిస్తాయి.. ఈ బిల్లు ద్వారా.

ఇందులోని సెక్షన్ 3 (4) నిబంధనల ప్రకారం.. ఆ ప్రాంతం మొత్తం కూడా పాకిస్తాన్ ఆక్రమణ నుంచి విముక్తమైన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరిస్తుంది. అక్కడ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలను ఎన్నికల సంఘమే స్వయంగా పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. ఈ బిల్లు ముసాయిదాలో పీఓకే అనే సంక్షిప్త పదానికి బదులుగా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం అని అధికారికంగా పేర్కొనడం గమనార్హం.
సాధారణంగా ఇతర ప్రాంతాలలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి సుప్రీంకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆక్రమిత ప్రాంతానికి మాత్రం కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా బాధ్యతలు తీసుకుంటుంది. డీలిమిటేషన్ కమిషన్ గా వ్యవహరిస్తుంది. ఈ నిబంధన జమ్మూకశ్మీర్ శాసనసభ స్థానాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. లోక్‌సభ స్థానాలపై ఇందులో ఎలాంటి ప్రస్తావన లేదు.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ శాసనసభలో పాక్ ఆక్రమిత ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలు కూడా ఖాళీగా ఉంటోన్నాయి. ఈ నూతన డీలిమిటేషన్ నిబంధనలు ఏ విధంగా వర్తిస్తాయనే దానిపై ముసాయిదా బిల్లులో స్పష్టం చేయలేదు కేంద్రం. 50 శాతం నియోజకవర్గాల స్థానాల పెంపు ఈ 24 సీట్లకు కూడా వర్తిస్తుందా లేదా అనేది కూడా వెల్లడించలేదు. ఈ బిల్లుతో భవిష్యత్తులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై దేశ సార్వభౌమాధికారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేసినట్టయింది.
పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బయటపడేంత వరకు కూడా ఈ స్థానాలను డీలిమిటేషన్ పరిధిలోకి తీసుకురాకూడదని పాత చట్టం నిర్దేశించింది. దీనికి భిన్నంగా ప్రస్తుత బిల్లు రూపుదిద్దుకుంది. ఒకవేళ ఆ ప్రాంతం భారత పరిధిలోకి వస్తే వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి విధానాన్ని అనుసరించాలనే అంశంపై స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని నిర్దేశించింది ఇందులో.














Click it and Unblock the Notifications
