యూపీ ఎన్నికల వేళ.. మహ్మద్ షమీ పొలిటికల్ ఎంట్రీ?
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్‌తో షమీ ఉన్నపళంగా భేటీ కావడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. ఆయన సొంత రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోన్నాయి. ఈ నేపథ్యంలో షమీ.. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీ బీజేపీ జాతీయ కార్యాలయంలో ఈ కీలక సమావేశం ఏర్పాటైంది. పార్టీ మైనారిటీ మోర్చా జాతీయ నాయకుడు కున్వర్ బాసిత్ అలీతో కలిసి బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు షమీ. బాసిత్ అలీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర పోషించినట్లు సమాచారం. ఒకవేళ షమీ బీజేపీలో చేరితే ఆయనకు అమ్రోహ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు మైనారిటీ మోర్చాలో జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే షమీ టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. భారత జట్టు తరఫున ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ప్రస్తుతం వన్డే, టీ20ల్లో కొనసాగుతున్నాడు. అతనికి జాతీయ జట్టులో అవకాశాలు దక్కట్లేదు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. టెస్ట్ ఫార్మట్ నుంచి తప్పుకొన్న అతి కొద్దిరోజుల్లోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడం, రాజకీయ ప్రవేశంపై ప్రచారం మొదలవ్వడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షమీకి క్రికెటర్ గా ప్రజాదరణ ఉంది. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో మైనారిటీ ఓటర్లను ఆకట్టుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహ్మద్ షమీ ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. షమీ వంటి ఓ టాప్ క్లాస్ ప్లేయర్ పార్టీలో చేరితే రాజకీయంగా ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని పార్టీ అధిష్ఠానం అభిప్రాయపడుతోన్నట్లు చెబుతున్నారు.
క్రికెటర్లు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహ్మద్ అజహరుద్దీన్ వంటి ప్రముఖ క్రికెటర్లు వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ గంభీర్ మాజీ ఎంపీ. హర్భజన్ సింగ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అజరుద్దీన్ గతంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి. యూసుఫ్ పఠాన్ కూడా లోక్ సభకు ఎన్నికయ్యారు.













Click it and Unblock the Notifications
