గత డీలిమిటేషన్ లో కాంగ్రెస్ లాభపడిందిలా..! లెక్కలతో లోకేష్ వరుస ట్వీట్లు ..!
కేంద్రం వచ్చే వారం పార్లమెంట్ ముందుకు తెస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై (Delimitation Bill) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ బిల్లును ఎన్డీయే పక్షాలతో పాటు విపక్ష ఇండియా కూటమిలోని డీఎంకే, శరద్ పవార్ ఎన్సీపీ వంటి పార్టీలు కూడా సమర్ధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. కాంగ్రెస్ పార్టీ (Congress) ఈ బిల్లును వ్యతిరేకించడాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
ఇందులో నారా లోకేష్.. కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా నియోజకవర్గాల పునర్విభజన గురంచి ఆందోళన మొదలైందన్నారు. కానీ, 2008లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గత పునర్విభజన ప్రక్రియ కాంగ్రెస్ పాలనలోనే రూపొంది, నోటిఫై అయిందన్నారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన ఏడు లోక్‌సభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుందని గుర్తుచేశారు. అప్పట్లో వారికి ఎటువంటి సమస్య లేదని వివరాలు వెల్లడించారు. 2008 ఫిబ్రవరి 19న నోటిఫై చేసిన ఉత్తర్వుల ప్రకారం అప్పటి డీలిమిటేషన్ ను ముందుగా 2009 ఎన్నికలలో ఉపయోగించారని లోకేష్ తెలిపారు.

ఇందులో భద్రాచలం, బొబ్బిలి, హన్మకొండ, మిర్యాలగూడ, పార్వతీపురం, సిద్దిపేట, తెనాలి అనే ఏడు లోక్‌సభ స్థానాలు మ్యాప్‌లో కనిపించకుండా పోయాయని, వాటి స్థానంలో కొత్తగా జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భోంగిర్, మహబూబాబాద్, అరకు, విజయనగరం వంటి ఏడు కొత్త స్ధానాలు వచ్చాయన్నారు. ఆ ఏడు కొత్త స్థానాల్లో ప్రతి ఒక్కటి కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. అరకులో ఏకంగా 1.9 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యం సాధించిందన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపం కూడా మారిందని, రంగారెడ్డి జిల్లాలో స్థానాల సంఖ్య 6 నుండి 14కు పెరగగా, ఉత్తర కోస్తా ఆంధ్రలో స్థానాలు తగ్గాయన్నారు.
విజయనగరంలో మూడు స్థానాలు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండేసి స్థానాలు తగ్గాయన్నారు. గత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కొత్తగా ఏర్పడిన ప్రతి స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, ఇప్పుడు దేశానికి న్యాయం గురించి నీతులు చెబుతోందన్నారు. ఈ కొత్త బిల్లు ప్రతి రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను కాపాడుతూనే, మహిళలకు 33% సీట్లను కల్పిస్తోందన్నారు. కాంగ్రెస్ అసలు దేనికి భయపడుతుందో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.














Click it and Unblock the Notifications
