US-Iran War: హార్ముజ్ లో భారతీయుల నౌకపై దాడి..! ఇరాన్ పై కేంద్రం ఫైర్..
అమెరికా-ఇరాన్ మధ్య తిరిగి ప్రారంభమైన యుద్ధ (US-Iran War) ప్రభావం భారత్ (India)పై పడటం మొదలైంది . హార్ముజ్ జలసంధిలో ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఇందులో ఉన్న 11 మంది తొలుత గల్లంతయ్యారు. వీరిలో 10 మందిని రక్షించారు. మరొకరు జాడ మాత్రం దొరకలేదు. ఈ ఘటనపై భారత్ భగ్గుమంది. ఇరాన్ దాడిని ఖండిస్తూ విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో విదేశాంగశాఖ.. "ఈ రోజు ఉదయం ఒమన్ తీరం సమీపంలో 'GFS గెలాక్సీ' అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. ఆ నౌకలో ఉన్న 11 మంది భారతీయులలో ఇప్పటివరకు 10 మందిని రక్షించారు, ఒకరు గల్లంతైనట్లు సమాచారం," అని ఒక ప్రకటనలో తెలిపింది. గాలింపు, సహాయక చర్యల కోసం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని వెల్లడించింది. ఓడపై జరిగిన దాడితో అది మంటల్లో చిక్కుకుందని, దీంతో తప్పించుకునేందుకు సిబ్బంది దూకేసినట్లు తెలుస్తోంది.

హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు, సైప్రస్ జెండాతో ఉన్న GFS గెలాక్సీపై తాము హెచ్చరిక కాల్పు జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హార్ముజ్ పై పట్టుబిగించేందుకు టెహ్రాన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ దాడి జరిగింది. గెలాక్సీ నౌకపై దాడి తరువాత ఈ జలమార్గంలో అనుమతి లేని మార్గంలో నౌక ప్రయాణిస్తోందని ఇరాన్ పేర్కొంది. అంతేకాదు ఈ ఘటనపై ఎలాంటి ప్రతీకార చర్యకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయబోతోందన్నది కీలకంగా మారింది.














Click it and Unblock the Notifications