'చిరంజీవికి పట్టిన గతే నీకూ పడుతుంది'
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ అక్కడ ఓ సంచలనం. కోలీవుడ్ లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ ఉన్న హీరో విజయే. ఇళయ దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళనాట ఆయనకు స్టార్ డమ్ రావడంలో తెలుగు సినిమాలు కూడా ముఖ్య పాత్ర వహించాయి. కోలీవుడ్‌లో తెలుగు రీమేక్ చిత్రాలు ఎక్కువ చేసిన హీరోల్లో విజయ్ ముందుంటారు. అందులో చాలా వరకు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
పెళ్లి సందడి(నినైతేన్ వంధాయ్), పవిత్ర బంధం(ప్రియమానవలె), బద్రి (బద్రి), నువ్వు నాకు నచ్చావ్(వసీగర), ఒక్కడు(గిల్లి),అతనొక్కడే(ఆది)..లాంటి చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ అనే చిత్రం చేస్తున్నారు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. హెచ్ వినోథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

అయితే స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం(TVK) అనే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. 2026 తమిళనాడు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయనున్నారు విజయ్. ఇక గతేడాది ఆయన పెట్టిన బహిరంగ సభకు ఏకంగా 5 లక్షలకు పైగా జనాభా వచ్చినట్లు సమాచారం.
అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు బోస్ వెంకట్.. విజయ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. నటన విషయంలో విజయ్ సూపర్ అని.. కానీ రాజకీయంగా జీరో అని అన్నారు. అంతేకాక విజయ్ రాజకీయ జర్నీ తెలుగు నటుడు చిరంజీవి రాజకీయ కెరీర్ లాగే అర్థాంతరంగా ముగుస్తుందని జోస్యం చెప్పారు. డీఎంకే పార్టీకి సవాల్ చేసేంత వయసు,అనుభవం విజయ్ కు లేవని ఎద్దేవా చేశారు. డీఎంకే పార్టీ ప్రస్థానం ముందు విజయ్ బచ్చా అని అన్నారు.
అంతకుముందు విజయ్ డీఎంకే, బీజేపీ పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈరెండు పార్టీలు సీక్రెట్ గా పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. 2026లో డీఎంకే, టీవీకే మధ్యనే యుద్ధం జరగబోతోందని తెలిపారు. డీఎంకే పార్టీ కావాలనే తమ పార్టీ కార్యక్రమాలను అడ్టుకుంటోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications