వెండితెర వెనుక చీకటి కోణాలు.. స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి అరెస్ట్
ఖరీదైన నగలు, విలాసవంతమైన జీవితం... వెండితెరపై మెరిసే నటీమణుల వెనుక చీకటి కోణాలు కూడా ఉంటాయని మరోసారి రుజువైంది. తాజాగా కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్టయ్యారు. ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు.
రన్యా రావు తరచూ దుబాయ్ వెళ్లొస్తుండడంతో అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. గత 15 రోజుల్లోనే ఆమె నాలుగుసార్లు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

రన్యా రావు తన దుస్తుల్లో బంగారు బిస్కెట్లను దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా.. తాను డీజీపీ కుమార్తెనని చెప్పి పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కర్ణాటకకు చెందిన ఓ పోలీసు అధికారికి రన్యా బంధువు అని తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులతో రాన్యాకు సంబంధం ఏంటని, ఈ స్మగ్లింగ్‌లో వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కిచ్చా సుదీప్ హీరోగా నటించిన 'మాణిక్య' చిత్రంతో రాన్యా రావు తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'వాఘా', 'పటాకీ' వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు రన్యా రావు అరెస్టవడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. ఆమెకు పోలీసులతో ఉన్న సంబంధాలపై, ఈ స్మగ్లింగ్‌లో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే దానిపై డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications