పవన్ ఫ్యాన్స్ గాలి తీసిన ప్రసాద్ మల్టీప్లెక్స్- సెటైర్లు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఓజీ. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీత్ రెడ్డి దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్.. కీలక పాత్రల్లో నటించారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది.
పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ప్రారంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత హిట్ బాట పట్టిందనేది ఇండస్ట్రీ రిపోర్ట్. పవన్ కల్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందీ మూవీ. ఆయనను ఎలా చూపడాలనుకున్నారో.. అలాగే తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఇంటర్వెల్, ఆ తర్వాతి కంటిన్యువేషన్ సీట్లు సినిమాకు ప్రధాన బలంగా సమీక్షకులు చెబుతున్నారు. హరిహర వీరమల్లు డిజాస్టర్ తో డీలా పడ్డ పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఈ మూవీ జోష్ నింపింది.

ఆ జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. సినిమా థియేటర్ లో బట్టలు చింపుకొనేంత. అందుకే- హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్.. ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ పెట్టింది. ఓజీ సినిమా చూడటానికి వచ్చే అభిమానులు తమవెంట ఓ ఎక్స్ ట్రా టీషర్టును తెచ్చుకోవాలని సూచించింది. సినిమా చూస్తోన్నప్పుడు అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండట్లేదని, కేకలు, గంతులు వేయడాన్ని దాటి చివరికి టీ-షర్టులు చింపేయడం వంటివి జరుగుతున్నాయని ప్రకటనలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పేర్కొంది.
#TheyCallHimOG #OG pic.twitter.com/ZHllpXoWj0
— Prasads Multiplex (@PrasadsCinemas) September 25, 2025
ఫ్యాన్స్ వీరాభిమానం సంతోషాన్ని కలిగిస్తోన్నప్పటికీ- కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయని.. సినిమా చూడటానికి వచ్చేటప్పుడు ఎక్స్ ట్రా టీ-షర్టు తీసుకురావాలని కోరింది. థియేటర్ లో మీ బట్టలకు తాము గ్యారంటీ ఇవ్వట్లేదనీ తేల్చి చెప్పింది. ప్రేక్షకుల ఈ ఉత్సాహాన్ని తాము అభినందిస్తున్నప్పటికీ, దీని వల్ల కలిగే నష్టాలను కూడా అర్థం చేసుకుంటున్నామని తెలిపింది. కాబట్టి, ఈ సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులు దయచేసి అదనపు టీ-షర్టును వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications