నాకూ టైం వస్తుంది... అప్పుడు చెబుతాను: రామ్‌చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో విఫలమవడంతో ఫ్లాప్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో సగం డబ్బు పాటలకే ఖర్చయింది. చివరకు సినిమాలో రూ.15 కోట్లు ఖర్చుపెట్టి తీసిన నానా హైరానా పాటను పెట్టలేదు. శంకర్ కు డబ్బంటే గౌరవం లేదని, అందుకే నిర్మాతలచేత ఇలా ఖర్చుచేయిస్తాడంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.
వాటిని సరిచేసుకొని ముందుకెళ్లాలి
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. దీన్ని రెండుభాగాలు విడదలు చేయాలని నిర్ణయించారు. సినిమా సమయంలో మొదటి భాగం విడుదల కాగా, రెండోభాగం తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా జయాపజయాల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి వైరలవుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బాలయ్య చెర్రీని ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎలా తీసుకుంటావు? అని అడుడుతారు. అందుకు రామ్ చరణ్ బదులిస్తూ జీవితంలో మనకెదురయ్యే ప్రతి సందర్భం ఒక పాఠం నేర్పుతుందని, అందులో తప్పులను గుర్తించి, వాటిని సరిచేసుకొని ముందుకు వెళుతుండాలన్నారు. అయితే ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు.

అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది
మిగిలిన అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని రామ్ చరణ్ అన్నారు. పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనదికాదు అనే భావనతో ఉండాలన్నారు. ఎవరు ఏది అన్నా ప్రతి విషయానికి స్పందించకూడదని, సమాధానం ఇవ్వకూడదని, మనకు కూడా టైం వస్తుందని, అప్పటివరకు ఎదురుచూడటం మినహా చేయగలిగేది ఏదీ ఉండదన్నారు.
కుటుంబ విషయంలోకానీ, సినిమా విషయంలోకానీ పరాజయాలు ఎదురైనప్పుడు వాటిని గుర్తుచేసుకుంటూ కుమిలిపోతూ కూర్చోకూడదని, పరాజయాల నుంచి విజయాలు వస్తాయని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. తనది ఆ తరహా మనస్తత్వమేనని, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూడటమే మనం చేయాల్సిన పని అని నొక్కి చెప్పారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరలవున్నాయి. అభిమానులు వీటిని అనేకరకాల అంశాలకు అన్వయించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications