Fact Check:ఏపీలో ఆ పార్టీదే అధికారం:కేంద్రానికి ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ నిజమెంత..?
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తో వస్తోన్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు సైతం వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
ఆత్మసాక్షి సంస్థ తన సర్వే వివరాలను విడుదల చేసింది. ఈ నివేదిక కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 96 నుంచి 106 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి 63 నుంచి 69 సీట్లకు పరిమితమౌతుంది. మరో 16 నియోజకవర్గాల్లో వైసీపీ- టీడీపీ కూటమి మధ్య హోరాహోరి పోరు నెలకొంటుంది.
తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యురో రిపోర్ట్ పేరుతో ఓ నోట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రిపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపింది. ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తెలిపింది. అసెంబ్లీలో 118 నుంచి 124 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగిస్తుందని వివరించింది. 49 నుంచి 51 శాతం ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసింది.
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి 48 నుంచి 51 సీట్లు మాత్రమే లభిస్తాయి. 41 నుంచి 45 శాతం వరకు ఓట్లు పడొచ్చు. కాంగ్రెస్ పార్టీ, ఇతరులకు ఒక్క సీటే లభిస్తుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా వేసిందనేది ఆ రిపోర్ట్ సారాంశం. మార్చి 2 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన గ్రౌండ్ లెవెల్ సర్వేలో ఈ విషయం తెలిసిందని పేర్కొంది. మొత్తంగా 3,56,541 మంది అభిప్రాయాలను సేకరించింది ఇంటెలిజెన్స్ బ్యూరో.
తన అయిదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, తీర ప్రాంతాల్లో ఓడరేవుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపింది. సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇళ్ల వద్దకే చేర్చడం ఆ పార్టీకి అతి పెద్ద ఓటుబ్యాంక్‌గా మారినట్లు అభిప్రాయపడింది.
ఎన్డీఏ కూటమి వెనుకబడటానికి గల కారణాలను కూడా ఇంటెలిజెన్స్ బ్యురో తన నివేదికలో విశ్లేషించింది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి కట్టడాన్ని ప్రజలు హర్షించట్లేదని, అన్ని వర్గాల ఓటుబ్యాంకును ఇది తీవ్రంగా ప్రభావితం చేసినట్లు వివరించింది. కూటమి మధ్య ఎమ్మెల్యే సీట్ల పంపకాలు అసంబద్ధంగా, అశాస్త్రీయంగా జరిగాయని తెలిపింది.
తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై ఇప్పటికీ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించడంలో కూటమి విఫలమైందని పేర్కొంది. అంశాలవారీగా, వాస్తవ పరిస్థితులను ఆధారంగా రాజకీయాలు చేయడంలో టీడీపీ, జనసేన విఫలం అయ్యాయని ఇంటెలిజెన్స్ బ్యూరో తన నివేదికలో తెలిపింది.
అయితే ఈ నివేదికపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది వాస్తవం కాదని తేలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి సర్వేలకు సంబంధించి ఎలాంటి లేఖలను విడుదల చేయదని తేలింది. గతంలో కూడా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి లేఖనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వస్తాయంటూ ఆ లేఖ వైరల్ అయ్యింది. అయితే అలాంటి లేఖ ఐబీ విడుదల చేయలేదని స్పష్టమైంది. అది కూడా తప్పు అని తేలింది.

Fact Check
వాదన
ఏపీలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్నికల సర్వే చేసి వైసీపీదే అధికారం అంటూ నోట్ విడుదల చేసింది
వాస్తవం
వాస్తవానికి ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేల పేరుతో ఎలాంటి నోట్‌ను విడుదల చేయదు.












Click it and Unblock the Notifications