వైయస్ కు తెలంగాణ టోపీ

YS Rajasekhar Reddy
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రజలు కుచ్చు టోపీ పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ, ఉత్తరాంధ్రలోనూ ఉన్న 154 అసెంబ్లీ స్థానాలకు, 22 పార్లమెంటు స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెసుకు చాలా వరకు ఎదురు గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మహా కూటమి ప్రభంజనం సాగుతుందని, కాంగ్రెసుకు ఎదురుగాలి వీస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ ప్రాంత ప్రజలు వైయస్ రాజశేఖర రెడ్డిని ఓడించే లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ నాయకులు ఎంత పట్టుబట్టినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వాదించినప్పటికీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వినలేదని, రాష్ట్రం నుంచి అత్యధిక లోకసభ స్థానాలకు గెలిపించుకొని వస్తానని కాంగ్రెసు పార్టీ అధిష్ఠానవర్గానికి హామీ ఇచ్చారని అంటారు. వైయస్ రాజశేఖర రెడ్డే అధిష్ఠానం వద్ద నెగ్గింది. దీంతో తెలంగాణలో కూడా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత రాజశేఖర రెడ్డి మీదనే పడింది. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. గత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి, డిఎస్ జోడు గుర్రాల్లా రాష్ట్ర కాంగ్రెసును ముందుకు నడిపించి విజయాన్ని అందించారు. ఈసారి డిఎస్ చాలా వరకు ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలోనే కాదు, తన సొంత జిల్లా నిజామాబాదులో పర్యటించినప్పుడు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలు చాలా వరకు విఫలమయ్యాయి. కరీంనగర్ లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సభకు కూడా పెద్దగా ప్రజలు రాలేదు. సోనియా తెలంగాణపై పాము చావకుండా కర్ర విరగకుండా మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఈ మాటను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నప్పటికీ అందుకు కాంగ్రెసు సిద్ధపడకపోవడం ప్రజల మనసుల్లో బాగానే నాటుకుపోయింది. ఆ తర్వాత తెలంగాణ పర్యటించిన రాహుల్ గాంధీ తెలంగాణ ఊసు కూడా ఎత్తలేదు. ఆయన సభలు కూడా చాలా వరకు విఫలమయ్యాయి.

తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లతో కూడిన మహా కూటమి విజయ పథంలో సాగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తెలంగాణలో ఖాతా తెరుస్తుందా అనేది కూడా సందేహమే. ఒక వేళ ఖాతా తెరిచినా రెండు మూడు శాసనసభా స్థానాలకు మించి రావని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం, మహా కూటమి గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతుందని ఎన్నికల ప్రచారం సందర్భంగా సందర్భంగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పడం ప్రజలకు ఆశలు రేకెత్తించినట్లు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసుకు చెందిన మంత్రులు కూడా ఏటికి ఎదురీదుతున్నారు. వినోద్‌, రత్నాకరరావు, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఫరీదుద్దీన్‌, పొన్నాల, చిన్నారెడ్డి విజయం కోసం చెమటోడుస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి, రెడ్యానాయక్‌, గీతారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, జానారెడ్డి, సంభాని చంద్రశేఖర్‌, వనమా వెంకటేశ్వరరావు వంటి వారికి కూడా విజయం నల్లేరు మీద బండి నడకలా లేదు. శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి కూడా గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇక మిగతా కాంగ్రెసు అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.హైదరాబాదు జిల్లాలోనూ, రంగారెడ్డి జిల్లాలోనూ తమకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ముఖ్యమంత్రి అంచనా వేసుకున్నారు. ఈ అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశాలున్నాయి.

ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులే పలు మార్లు చెప్పిన సంఘటనలున్నాయి. వైయస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ మాత్రం అంగీకరించరనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో నాటుకుపోయింది. కాంగ్రెసు తిరిగి విజయం సాధిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కాదనే అభిప్రాయం ప్రజల్లో బలంగానే ఉంది. ఇదే కాంగ్రెసును తెలంగాణ ప్రాంతంలో దెబ్బ తీసే అవకాశాలున్నాయి. అదే సమయంలో కూటమి కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ బలపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలో పదే పదే హామీ ఇచ్చారు. ఇది కూడా మహా కూటమికి అనుకూలంగా మారింది. మొత్తం మీద, తెలంగాణలో వైయస్ రాజశేఖర రెడ్డికి తిరుగులేని దెబ్బ తగిలే ప్రమాదమే ఉంది. తెలంగాణలో కాంగ్రెసుకు 30 శాసనసభ స్థానాలు వస్తే ఎక్కువనే పరిస్థితి నెలకొని ఉంది. కాకపోతే 40 దాకా వస్తాయేమోనని అనే వారున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+