రంగనాయకమ్మ శంకరాచార్య ప్రతినిధి

BS Ramulu
రంగనాయకమ్మగారు మార్క్సిజం ముసుగ తొడుక్కున్న పెటీబూర్జువా వర్గం మనిషి. భారతీయ దోపిడీ వర్గ నాలుగో శ్రేణి (ఫోర్త్‌ గ్రేడ్‌) ప్రతినిధుల్లో ఒకరు. గత డెబ్బయి ఏళ్లుగా భారతీయ దొపిడి వర్గాలలోని నాలుగో శ్రేణి రాజకీయ నాయకులు, మొదటి రెండవ శ్రేణి దోపిడి వర్గాలతో తమ దోస్తీ, వాటా, నాయకత్వం సాధించుకోవడం కోసం, గుర్తింపు పొందడం కోసం శ్రామిక వర్గం పేరు జపిస్తూ ఈ దేశ పీడిత వర్గ ప్రజానీకాన్ని తమ ఆధిపత్య దోపిడీకి సాధనాలుగా మార్చుకున్నారు.

ఎవరో విప్లవం చేయాలి. తాను తన పిల్లలు మాత్రం ఈ వ్యవస్థలోనే సుఖపడాలి, పేరు తెచ్చుకోవాలి. రేపటి (స్వర్గ) విప్లవ సుఖాలు మీకు ఇవ్వాలటి సుఖాలు మాకు అని అనుభవిస్తూ రేపటి విప్లవం ఎలా చెయ్యాలో మేము చెప్తామని నిర్దేశిస్తూ భావజాల నాయకత్వం వహిస్తూ బతకాలి అనే కోవకు చెందిన తాత్విక దోపిడి వర్గ ప్రతినిధి రంగనాయకమ్మ. బ్రాహ్మనిజం ఆచరణే ఇది. ఎలా యుద్దాలు చేయాలో చెప్పి గెలిచిన రాజులకు కిరీటాలు పెట్టి ఓడిన రాజులకు నేను చెప్పినట్టు (వాస్తు ఫలితం లాగా) వినకపోడాన జరిగిన ఫలితం ఓటమి అని నిర్దారించే తత్వాన్ని ఈ దేశ తాత్విక పరిభాషలో బ్రాహ్మణిజపు కుల వృత్తి అని పిలుస్తారు. వాళ్లు ఈ మేధో రంగ కుల వృత్తి నుంచి శారీరక శ్రమ చేసే శ్రామిక వర్గ వృత్తులకు మారడమే ఈ దేశంలో - నిజానికి ఏ దేశంలోనయినా రావలసిన మౌలిక మార్పు. కంచ అయిలయ్య ఈ విషయంపై చాలానే రాశారు. ఇది మార్క్సిజం లక్ష్యం కూడా.

ఈ దేశంలో శ్రామిక వర్గ కుల వృత్తులలో కలవారు మేధోరంగ వృత్తుల్లోకి మారినప్పుడే దోపిడి వర్గ స్వభావాన్ని మార్క్సిజం మేక తోలు కప్పుకున్న మేధో కుల వృత్తి దోపిడి వర్గ స్పష్టం చేయడం సాధ్యమవుతుంది. అయితే రష్యా, చైనాల్లో విప్లవానంతరం కూడా ఈ రెండూ సాధ్యం కాలేదని పై వాళ్లు పైకులాలుగా స్థిరపడ్డారని రామ్‌మనోహర్‌ లోహియా విస్తృత అధ్యయనంతో తేల్చిచెప్పారు. ఇలా పై కులాల కుల వ్యవస్థ కనువుగా ఉన్నందునే దోపిడి వర్గ ప్రతినిధులు ఆధునిక ఆయుధంగా మార్క్సిజం జపిస్తారు. వాస్తవ ఆచరణలో శంకరాచార్య ప్రతినిధులు వీరు.

1. రంగనాయకమ్మ రచయిత్రిగా పెటి బూర్జువా వర్గ ప్రతినిధి. ఆమె కథల్లో రచనల్లో శ్రామిక వర్గమైన బహుజన కులాల సంస్కృతి గాని జీవితంగాని వారి సామాజిక పరిణామాలు గాని, ఉత్పత్తి సంబంధాలు గాని, వారి ఆశలు ఆరాటాలు గానిలేవు. భావాలు మారాయి అని చెప్పుకుంటూనే అవే అచ్చేసుకుంటూ అమ్ముకతినే, మార్క్సిజం చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకు తినే దోపిడి వర్గ భావజాల కెరీరిస్టు రచయిత్రి రంగనాయకమ్మ.

2. రంగనాయకమ్మ అలాంటివాళ్లు పెటీ బూర్జువా వర్గ ప్రతినిధులుగా ఉండడం వల్లనే వాల్లు చెప్పే మార్క్సిజం పీడిత వర్గం దృక్పథం ద్వారా గాంధీ, నెహ్రూ, రాజాజీ, సుభాష్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, శంకరాచార్య, యం.యన్‌.రాయ్‌, యం.యస్‌. గోల్వాల్కర్‌, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, రామకృష్ణ పరమ హంస, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి తదితరుల భావజాలాల్ని అందులోని వర్గ తత్వాన్ని ఎండగట్టే గ్రంథాలు రాయకుండా వేల ఏళ్ల పీడిత కులాల విముక్తికై జీవితాన్ని అర్పించి ప్రపంచ సోషలిజానికి మౌలికమైన చేర్పులు చేసిన అంబేడ్కర్‌ను విమర్శిస్తూ రాయడం సాధ్యపడింది. పైవాళ్లలో మంచిని వెదికి, వారి భావజాల సంస్థలతో, పార్టీలతో దోస్తీ కట్టి అంబేద్కరిజంలో మాత్రం చెడును, లోపాలను వెతికి, అంబేద్కరిస్టు సంస్థలతో దూరంగా ఉండే వాళ్లందరూ ఈ కోవకే చెందుతారు.

3. వ్యక్తిగత ఆస్తి రద్దు ప్రతిపాదన దానికదే ఏమంత గొప్ప విషయం కాదు. దానికదే గొప్ప అయితే అది చెప్పి ఆచరించిన వారు మార్క్స్‌ కాదు - బుద్ధుడు. మార్క్స్‌ చెప్పినట్టు ఆస్తి హక్కు రద్దు చేసి ప్రభుత్వపరం చేస్తే ఏం జరిగిందో రష్యా చైనాలో చూసే ఉన్నాము. పార్టీ నాయకులే, ప్రభుత్వాధినేతలే టాటా, బిర్లాల లాగా అటు ఆస్థిపై హక్కును, ఇటు రాజకీయ అధికారాన్ని రెంటినీ అనుభవించారు. అది ఫ్యూడలిజానికి మల్టీనేషనల్‌ కంపెనీల పెట్టుబడి దారీ విధానానికి మార్క్సిజం పరిభాష అందించడం తప్ప మరేమీ కాదు.

4. అంబేద్కర్‌ మార్క్సిజం వైఫల్యాలని రష్యాలో చూశాకే పార్టీ సిద్ధాంతంతో ప్రమేయం లేకుండానే నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాలని రాజ్యాంగ పరంగా పొందుపరచి, ఏక పార్టీ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ బహుళ పార్టీ వ్యవస్థను ఆహ్వానించాడు. మావో చైనాలో ఆస్థిహక్కును రద్దు చేయలేదు. భారతదేశంలో సంస్థానాలను విలీనం చేయడానికి శాంతియుత పద్ధతిలో రాజభరణాలకు అంగీకరించారు నాయకులు. తర్వాత ఇరవై ఏళ్ళకే ఇందిరాగాంధీ ఒక కలం పోటుతో రాజభరణాలు రద్దు చేసింది. అంబేద్కర్‌ ఇద్దామని చెప్పిన డివిడెండ్లు, వడ్డీలు అట్లాగే ఎప్పుడయినా రద్దు చేయడం సాధ్యమే. భూముల్ని ఆస్థుల్ని, పరిశ్రమలని ప్రజలనుంచి దోపిడి వర్గాలనుంచి సేకరించి డివిడెండ్లిచ్చాక రెండవ తరంలో వారి వారసత్వానికి కూడా వృత్తి ఉపాధి కలిగించాక రాజభరణాల రద్దు లాగే బ్యాంకుల జాతీయకరణలాగే ఈ డివిడెండ్లు, వడ్డీలు రద్దు అవుతాయి. శాంతియుత పరివర్తన కోసం ఇది మధ్యంతరంగా చెల్లిస్తున్న మూల్యం ఇది. ఏదేశంలో నయినా అవసరమవుతున్న ప్రక్రియ ఇది. మావో, గ్రాంసి దీన్ని గమనించి ఆచరణలో రూపాలు తీసుకున్నారు. అదే నూతన ప్రజాస్వామిక విప్లవమనే మధ్యంతర థ. అదే పౌర సమాజమని గ్రాంసి భావనలో, రోజా లగ్జెంబర్గ్‌లో చూడవచ్చు. యుద్దం ద్వారా ఆస్థి నష్టం ప్రాణ నష్టం అనేవి జాతీయ నష్టాలు. వాటితో పోల్చితే డివిడెండ్లు వంటివి ఇచ్చి, వారిని మానసికంగా కూడా మార్పుకనువుగా మార్చడం ఆధిపత్యం నుంచి తొలగించడం ఎంత తక్కువ ఖర్చు. లాంగ్‌ మార్చ్‌లు చేయించి మహా యుద్దాలు వర్గ పోరాటాలు చేయించి వెనక ఉండడం వల్ల మార్క్స్‌లు మావోలు, రంగనాయకమ్మలు, కొండపల్లి సీతారామయ్యలు మిగులుతారు. ముందుండి పోరాడి పోయే వారి మాటేమిటి. ముప్పయి అయిదు లక్షల జనంలో చచ్చీ చెడి, అయిదు లక్షలు మిగుల్చుకునే లాంగ్‌ మార్చ్‌ దీర్ఘకాలిక వ్యూహం ఎత్తుగడల యుద్దోన్మాదంలోనికి దించడమే వీరి లక్ష్యం.

అయితే భారతీయ శ్రామిక వర్గం ఇందుకు వ్యతిరేకం. మనిషిలాగే, చెట్టులాగే నిరంతరం సమాజం మానసికంగా, శారీరకంగా నిరంతరం పరిణామం చెందినప్పుడే ఆ మార్పు సమాజంలో నిలకడగా ఉంటుందని సోషలిజానికి ఆకస్మాత్తు మార్పుల రెవల్యూషన్‌ స్థానే, ఎవల్యూషన్‌ ప్రాధాన్యతను చేర్పు చేసినవాడు అంబేద్కర్‌. తరతరాలుగా ఆస్థిలేని పీడిత వర్గ కులాలకు ఆస్థి లేకుండా చేసి దానిపట్ల ఆసక్తి లేకుండా చేసి దోపిడివర్గాలే దాన్నంతా అనుభవించడం కోసం అదంతా మాయ, పాపం, సన్యాసమే మంచిదన్నట్లుగా పేదరికమే మంచిదన్నట్లుగా ఈరోజు మార్క్సిజం జపిస్తున్నారు.

విప్లవం వచ్చాక ప్లేటు మార్చుకొని వీళ్లే (నేటి ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపతుల్లా, ఐ.ఎ.ఎస్‌. అధికారుల్లా, సహకార రంగ భోక్తల్లాగా) మార్క్సిజం పేరుతో మాటలు నేర్చిన పకక్షులు పార్టీల్లో, నాయకత్వాల్లో చొరబడి తిరిగి చేజిక్కించుకోవడానికి తప్ప ఇది మౌళిక మార్పేమీ కాదు, మరేమీ కాదు. రష్యా, చైనాలోనే కాదు. యూరోప్‌లోనే కాదు, భారతదేశంలోను కూడా ఇదే జరుగుతున్నది. కలెక్టర్లకు, ప్రభుత్వరంగ సంస్థలకు అది వ్యక్తిగత ఆస్థి కాకపోయినా అన్నీ అనుభవిస్తున్నట్లే ఆస్థి హక్కు రద్దయ్యాక కూడా అనుభవిస్తారు. తూర్పు యూరోప్‌లో సోషలిస్టు సమాజంలో చెప్పులకు లక్షల రూపాయల రత్నాలు అద్దుకున్నారని పత్రికల్లో అందరూ చూసే ఉన్నారు. కాకపోతే వీళ్లు మార్క్సిజం పరిభాషలో అనుభవిస్తారు. ఈ కాస్త దానికి విప్లవం దేనికి, మార్క్సిజం దేనికి! ఆస్థి హక్కు రద్దు దేనికి భావజాల ఆదిపత్యంతో ఆస్థిపై అధికారాన్ని అనుభవించడమే మార్క్సిజం చేస్తున్న పని. మార్క్సిజంలో ఎన్నో మంచి అంశాలున్నాయి. వాటిని ఇతర గ్రంథాలలో రాశాను. అంబేద్కరిజం, బుద్దిజం ప్రపంచ మానవాళి విముక్తిని, స్వేచ్చను, కరుణను, సమానత్వాన్ని, సోషలిజాన్ని కోరుతుంది.

మార్క్సిజం లేకముందూ ప్రపంచం ఉంది. మార్క్సిజం లేకపోయినా ప్రపంచం ఉంటుంది. మానవ సమాజ పరిణామంలో ఎన్నో భావజాలాలు వస్తాయి, పోతాయి. మనిషి, మానవత సమాజం, ప్రపంచం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకు ఆయా కాలాల్లో వ్యాప్తి చెందే భావజాలాల్లోని మంచిని స్వీకరిస్తూ, చెడుని పరిహరిస్తూ ముందుకు సాగడమే మానవాళి చేస్తున్న ఆచరణ. ఏ భావజాలమైనా పాతబడక తప్పదు. కొత్తది రాకతప్పదు. జీవితం కొత్తదయినపుడు, అనుభవాలు కొత్తవయినపుడు కొత్త భావజాలాలు ఎదగకా తప్పదు.

- బియస్ రాములు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+