జయంతి: పివి అంతర్ముఖీనత్వం వెనక......

పివి అంటే అంటే పోరాట వీరుడు - రాజబహుదూర్ గౌర్
పివి పరిపాలనాదకక్షుడు - జనరల్ కె.వి. కృష్ణారావు
మాజీ ప్రధాని, స్వర్గీయ పి.వి. నరసింహారావుకు అమెరికాలోని అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్‌వారు హైదరాబాద్‌లో ప్రతిభామూర్తి లైఫ్‌టైమ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అవి. కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను, ఆర్థికసామాజిక పరిణామాలను ప్రత్యక్షంగా వీక్షించమే కాకుండా వాటి పరిణామాలకు, మార్పులకు దోహదకారి కూడా అయిన పి.వి. నరసింహారావు రాజకీయాలను వృత్తిగా స్వీకరించినవారు కారు. కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, సాహిత్య సాంస్కృతిక రంగాలపై పండితులకు, మేధావులకు సరిదీటుగా నిలబడి వ్యాఖ్యానించగల దిట్ట. సామాజిక మర్మమెరిగిన జ్ఞాని. బహుభాషావేత్త.
అన్ని రంగాల్లోనూ ప్రజ్ఞాపాటవాలు, ప్రపంచ మనుగడపై, దాని పోకడలపై అవగాహన కలిగిన పి.వి. నరసింహారావుకు ఆప్తులు చాలా మందే ఉన్నారు. పౌరహక్కుల కోసం నిరంతరం గొంతునిస్తూ వచ్చిన ప్రజాకవి కాళోజీ పి.వి. నరసింహారావును తనవాడిగా స్వీకరించగలిగినవారు. నిష్కలంక పోరాట చరిత్ర కలిగిన రాజబహదూర్ గౌర్ ఆ రోజు పివి సరసన నిలబడ్డారు. ఈ సందర్భంలో పివి పక్కన నిలబడ్డవారు పి.వి. నుంచి ఏమీ ఆశించినవారు కారు. పి.వి. నరసింహారావు అధికారం కోల్పోయి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తర్వాత ఆయన పక్కన నించున్నవారు ఎవరూ ఆయన నుంచి ఏమీ ఆశించినవారు కారు. పైగా వారందరూ తమ తమ జీవనయానాలలో, తమ తమ జీవిత విధానాల పట్ల నిర్దిష్టమైన దృక్పథం కలిగినవారే. వారు పి.వి. నరసింహారావును అభిమానించారంటే ఆయన విధానాలను పూర్తిగా అంగీకరిస్తున్నారని, ఎవరి వ్యక్తిత్వాలను వారు కాపాడుకుంటూనే స్నేహానికి, సాన్నిహిత్యానికి ఒక అర్థం చెప్పినవారు.
ఈ సభలో పి.వి. నరసింహారావు ఆబ్జెక్టివ్‌గా చాలా వ్యాఖ్యలు చేశారు. దేశంలో యుద్ధ పరిస్థితులున్నాయని, ఇందుకు ప్రజలు సంసిద్ధం కావాలని ఆయన అన్నారు. 1962 చైనాతో జరిగిన యుద్ధం తర్వాత మన రక్షణ రంగాన్ని ఆధునీకరించుకున్నామని, ఆనాటి పరిస్థితులే నేడున్నాయని ఆయన అన్నారు. 1991లో దూరాలోచన చేసినందు వల్లనే మనం ఆర్థిక గడ్డు పరిస్థితులను అధిగమించగలిగామని ఆయన చెప్పారు. ఎంతో కాలం చట్టసభల్లో ఉన్న పి.వి. నరసింహారావు దేశానికి సంబంధించిన ఏ పరిణామాన్నయినా అధికారయుతంగా విశ్లేషింగలిగేవారు. ఆ రోజు ఆయన దాదాపు అరగంట సేపు దేశరాజకీయ పరిణామాలను సంక్షిప్తంగా రూపుకట్టి ప్రేక్షకుల ముందుంచారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంలోనే పాదులు పడినప్పటికీ దానికి ఒక ఊపును, వేగాన్ని ఇచ్చిన, ఒక దిశను నిర్దేశించినవారు పి.వి. నరసింహారావు. ప్రస్తుత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసిన ఆర్థిక సంస్కరణలకు నిర్దిష్ట రూపాన్ని, గమనాన్ని నిర్దేశించారు. ఈ సంస్కరణలను వామపక్ష మేధావులు, రాజకీయ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. అయితే పి.వి. నరసింహారావు అధికారం నుంచి తప్పుకున్న తర్వాత, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆ సమయంలో ఆయన రాజకీయ పరిస్థితులపై వ్యాఖ్యానించలేదు. ఎవరి గురించీ నోరెత్తి పల్లెత్తు మాటా అనలేదు. తనపై తప్పుడు కేసులు పెట్టారనో, రాజకీయ కక్ష సాధిస్తున్నారో అని ఆయన మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా నోరు పారేసుకోలేదు. అది బహుశా చేసిన కర్మకు ఫలితం అనుభవించకతప్పదనే ధోరణి కావచ్చు. నడుస్తున్న ప్రభుత్వాల తీరు, రాజకీయ పరిణామాలపై ఆయన చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడలేదు. ఆయన వాటిని గమనిస్తూ వెళ్లారనేది మాత్రం అర్థమవుతూ ఉండేది. రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించని ఆయన రెండు మూడు సార్లు ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు అమలవుతున్న తీరును ఆయన ఆక్షేపించారు. పేదలకు మేలు చేసే విధంగా అవి అమలు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంస్కరణలు పేదలకు మేలు చేసే విధంగా పి.వి. నరసింహారావు ఎలా అమలు చేసేవారో మాత్రం తెలియదు. ఆ విషయం ఆయన చెప్పలేదు కూడా. ఆయనను అడిగినవారూ లేరు. ఆయా రంగాల్లో మేధావులైనవారిని ఆహ్వానించి సలహాలను తీసుకొని విధానాలను అమలు చేసే చిత్తశుద్ధి వర్తమాన రాజకీయాలకు లేదు. ఇది వేరే విషయం. ఆయన మాటలను బట్టి ఆర్థిక సంస్కరణలను పేదలకు అనుకూలంగా అమలు పరిచేందుకు వీలైన ప్రణాళిక ఏదో ఉండి ఉండే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సంస్కరణలకు అమర్త్యసేన్ చెప్పిన మానవ ముఖం తొడిగేవారా? ఏమో తెలియదు.
ఇకపోతే కాళోజీ సత్కారసభ ఒకటి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. ఆ రోజు ఆ ఆడిటోరియం క్రిక్కిరిసి పోయింది. అంతకు దగ్గరి నుంచి చూడలేని ఈ తరం యువకులందరూ ఆయనను చాలా సన్నిహితంగా ఆ రోజు చూశారు. ఆ రోజు పి.వి. తన అంతరంగాన్ని విప్పారు. అది చాలా మందిని కదిలించింది. కేవల రాజకీయ నాయకుడిని కొట్టి పారేసినట్లు పివిని కొట్టివేయడానికి వీలు లేదని చాలా మంది ఆ రోజు అర్థం చేసుకొని ఉంటారు. ఒక దృక్పథం, దాన్ని ఆచరణలో పెట్టవలసి విధానం వంటివి కక్షుణ్ణంగా ఎరిగి వాటిని ముందుకు తీసుకుపోలేని పివి బహుశా ఆ రోజు చాలా మందికి కనిపించి ఉంటారు. ఆ రోజు ఆ ఆడిటోరియం కిటకిటలాడింది. కాళోజీ పివికి సన్నిహిత మిత్రుడు. ఆయితే కార్యరంగానికి వచ్చేసరికి ఎవరి దారులు వారివే. పి.వి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరినవాడు కాళోజి. అలాంటి కాళోజీ పక్కన పి.వి. ఆ రోజు నిలబడ్డారు. అలా నిలబడడానికి, పరస్పరం గౌరవించుకోవడానికి విభేదాలేవీ ఆ తరంవారికి అడ్డు రాలేదని ఈ సభ మరోసారి రుజువు చేసినట్లు అనిపించింది. ఆ రకంగా కూడా పివి ఒక కొత్త అనుభవాన్ని ఈ తరం వారికి మిగిలించిపోయారు.
ఐదేళ్లు మైనారిటి ప్రభుత్వాన్ని నడపగలిన సమర్థతను కొంత మంది కొనియాడారు. అయితే బహుశా ఇదే ఆయనకు వ్యక్తిగతంగా పెద్ద గడ్డుకాలం అయి ఉంటుంది. అందుకు ఆయన ప్రమేయం ఉండో, లేకనో చాలా జరిగిపోయాయి. ఆ కారణంగా రాజకీయాల్లో ఆయన వివాదాస్పదుడిగా మారారు. ఆయనను అపర చాణుక్యుడు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త, సమకాలికుడు దాశరథి రంగాచార్య ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రధానిగా పివి కరణీకం చేశారని అన్నారు. పివిని గొప్ప ఆలోచనాపరుడిగా అభివర్ణిస్తూనే ఆయన ఆ మాటన్నారు. ఇలా తన ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆయనకు అనేక పేర్లు తెచ్చి పెట్టాయి. అయితే ఇవేవీ తెలుగు ప్రాంతంలో, తన సన్నిహిత మిత్రబృందంలో ఆయన వ్యక్తిత్వానికి విఘాతం కలిగించలేకపోయాయి. నిజానికి, రాజకీయాలకు దూరమైన తర్వాత తన చివరి రోజుల్లోనే ఆయన తనకు కావలిసినవారిని కలుసుకున్నట్లు, తనకు ఇష్టమైన విషయాలు మాట్లాడినట్లు అనిపిస్తూ ఉంటుంది. తన పాత జీవితాన్ని ఆయన కళ్లకద్దుకోవడానికి ఆయనకు అవకాశం లభించింది. ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి పి.వి. నరసింహారావును కలిసి తాను సంకలనం చేసిన 'తొలి తరం తెలంగాణ కథలు' పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. ఆ సంకలనంలో పి.వి. రాసిన 'గొల్ల రామవ్వ' కథ ఉంది. ప్రముఖ కవి అఫ్సర్‌లాంటి వారికి ఇష్టాగోష్ఠిగా సాహిత్య ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా మంది సాహిత్యకారులు ఆయనకు దగ్గరయ్యారు. 'ఇన్‌సైడర్' నవలను తెలుగులోకి తెచ్చే క్రమంలోనూ, ఇతరత్రా ఆయనను తెలుగు సాహిత్యకారులు కలవడానికి ఆయన చివరి థ అవకాశం కల్పించింది. తద్వారా ఆయన అంతరంగం, లోలోన రగిలిపోతున్న ఆత్మ బయటపడుతూ వచ్చాయి. అందువల్లనే ఆయన మీద ఎన్ని మచ్చలు పడినా ఆదరణీయుడిగా మిగిలిపోయారేమో!
తెలుగు కథా ప్రక్రియలో నిజానికి గొల్ల రామవ్వ కథకు విశిష్ట స్థానం దక్కాలి. నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడుత్ను యోధుడిని అక్షర జ్ఞానం లేని వృద్ధ మహిళ పోలీసు నుంచి రక్షించిన తీరును ఈ కథలో పి.వి. అభివర్ణించారు. హృదయానికి హత్తుకునే కథ ఇది. తెలంగాణ భాషను సమర్థంగా ప్రయోగించారు పి.వి. నరసింహారావు. నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జరిపిన పోరాటానికి మచ్చుతునక ఈ కథ. ఆయన సాహిత్య కృషి చాలా చేశారు. అదంతా ఒక వెలుగులోకి వస్తే గానీ ఆయన వ్యక్తిత్వమేమిటో, ఆయన దృక్పథమేమిటో పేదల పక్షాన, గ్రామీణుల పక్షాన ఆయన ఎలా నిలబడ్డారో పూర్తిగా అర్థం కాదు. పి.వి. నరసింహారావు వ్యక్తిత్వం బహుముఖీనమైంది.
ఇదంతా ఇలా ఉంటే, మన దేశానికి ఏం కావాలో బాగా ఎరిగినవాడు ఆయన. గ్రామీణ ప్రాంతాల్లోని మెరికల్లాంటి కుర్రాళ్లను ఆయన దేశానికి నాయకత్వం వహించే యోధులుగా బహుశా ఆయన తీర్చి దిద్దాలని అనుకొని ఉంటారు లేదా మట్టిలో మాణిక్యాలను వెలికితీసే అవకాశాలు కల్పించాలనైనా అనుకొని ఉంటారు. గురుకుల పాఠశాలలకు ఆయన శ్రీకారం చుట్టడాన్ని బట్టే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠశాలల్లో చేరిన ఎంతో మంది గ్రామీణులు ఇవాళ్ల ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. ఇలా ఆయన చాలా వాటికి ఆద్యుడు. ఈ విషయాలేవీ బయట ప్రపంచానికి తెలియవు. అలా తెలియజెప్పే యంత్రాంగమేదీ పివికి ఉన్నట్లు లేదు. ఆయన సన్నిహితులకు ఆ ధ్యాస ఉన్నట్లు లేదు.
భూసంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఆయనే. కేవలం రాజకీయ మనుగడ కోసమో, మరేదానికో ఆయన సంస్కరణలు చేపట్టలేదు. దానికి ప్రేరణ వేరే కావచ్చు. అది ఇక్కడ అప్రస్తుతం. తన సొంత గ్రామంలోని వంగరలో తన కుటుంబానికి భూపరిమితి చట్టానికి మించి భూములను అన్నింటినీ ఆయన పంచి పెట్టారు. ఇప్పటికీ ఆయన భూములను గ్రామంలోనివారే సేద్యం చేసుకుంటారు. దాని నుంచి ఆయన ఏనాడూ ప్రతిఫలం ఆశించలేదు.
జీవితం పట్ల సరైన దృక్పథం గలవారే పివి లాగా ఉండగలరు. అంతర్ముఖీనత్వం పి.వి. నరసింహారావుకు అందుకే సంతరించి ఉంటుంది. దేశానికి ఏం కావాలో ఎరిగినవాడు ఆయన. అందుకు ఏం చేయాలో తెలిసినవాడు. తెలంగాణలోని మేధావుల వ్యక్తిత్వానికి, నిస్సహాయతకు పి.వి. నరసింహారావు ఒక నిలువెత్తు అద్దం. ఆర్యసామాజికుడైన పి.వి. ఈ వ్యవస్థ మెరుగు పడడానికి కావలసిన దారేదో తెలిసినవాడు. దారులు తెలిసీ జరుగుతున్న పరిణామాలను సమాజంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఆహ్వానించాల్సిన స్థితే తెలంగాణ మేధావులు చాలా మంది ఎదుర్కుంటున్నారు. ఈ కోణం నుంచి పి.వి. నర్సింహారావును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన 'ఇన్‌సైడర్' రాశారు. ఆ కారణం వల్లనే ఆయన 'ఇన్‌సైడర్'లాంటి నవలలు ఇంకా రావాలని ఒకానొక సందర్భంలో అన్నారు. బహుశా అందుకే కావచ్చు. ఈ దేశ రాజకీయాలు పేదల, గ్రామీణుల పక్షాన నడవకపోవడానికి కారణమేమిటో, తన లాంటి కొంత మంది రాజకీయ పద్మవ్యూహంలో నిస్సహాయులైన అభిమానుల్లా దెబ్బ తింటారో తెలియడం అవసరమని ఆయన భావన కావచ్చు.
రాజకీయాలను నిర్దేశించి, నడిపించి తమకు అనుకూలంగా మలుచుకొనే చైతన్యం, తెగువ ప్రజలకు ఒనగూరాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకే పి.వి.ని విమర్శించడానికి ఆయనను అర్థం చేసుకోవడానికి ముందు తరాలు ప్రయత్నించడం ఎంతైనా అవసరం. తెలంగాణవారికి అది మరింత అవసరం.
-కాసుల ప్రతాపరెడ్డి
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications