కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఎలా?

హైదరాబాదు తెలంగాణ ప్రాంతానికి చారిత్రకంగా రాజధానిగా ఉంటూ వస్తోందని, పైగా అది తెలంగాణ నడిబొడ్డున ఉందని, అందువల్ల తెలంగాణ నుంచి హైదరాబాదును వేరు చేయడం కుదరదని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాదు వేరు చేయడం భౌగోళికంగా సాధ్యం కాదని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూ వచ్చారు. అది సాధ్యమనే విషయం తాజాగా తెలిసి వచ్చింది. పైగా, అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ పదే పదే అంటుండంలోని ఆంతర్యం తెలిసి వచ్చినట్లయింది. సీమాంధ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్ర్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే. హైదరాబాదు కోసమే వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేస్తే ఆ వ్యతిరేకత రాదు. సీమాంధ్రుల నుంచి వ్యతిరేకత రాకుండా చూడడానికి అదే మందని శ్రీకృష్ణ కమిటీ ఆలోచనలో ఉండవచ్చు. దానికి తెలంగాణవాదులను ఒప్పించడం కూడా పెద్ద కష్టం కాదని అనుకుంటూ ఉండవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే, భౌగోళికంగా హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి గల అవకాశాలను చూద్దాం.
తెలంగాణవాదులు అంగీకరిస్తారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భౌగోళికంగా సాధ్యమయ్యే పనే. అయితే, నల్లగొండ జిల్లా మొత్తం దాంట్లోకి వచ్చే అవకాశం లేదు. హైదరాబాదుకు, కోస్తాంధ్రకు మధ్య తెలంగాణ రాష్ట్రం ఉండకుండా చూడడమే కావాల్సింది. హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట వరకు, మరో వైపు గుంటూరు జిల్లా సరిహద్దుల వరకు కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి వీలవుతుంది. భౌగోళికంగానే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కూడా ఆ వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగుడా వంటి ప్రాంతాల్లోకి కోస్తా వలసలు విరివిగా సాగాయి. కోస్తాకు చెందిన పలువురు చాలా కాలం క్రితమే వలస వచ్చి స్థిరపడిపోయారు. సంపన్నులుగా ఎదిగారు. నాగార్జున సాగర్ కాలువ కూడా వస్తుండడంతో మిగతా మెట్టప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతాలు కాస్తా సస్యశ్యామలంగా ఉంటాయి. హుజూర్ నగర్ ప్రాంతంలో 11 దాకా సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. చాలా ఫ్యాక్టరీలు కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు చెందినవే. ఆ రకంగా ఆ ప్రాంతంలో కోస్తా వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అక్కడి సంస్కృతి కూడా కోస్తా ప్రాంత సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కూడా తెలంగాణ నుంచి నల్లగొండ జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని విడదీయడానికి అవకాశం ఉందనే వాదనను ముందుకు తేవచ్చు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి తగిన అవకాశాలు ఉన్నాయనే వాదనకు ఏదో మేరకు బలం చేకూరుతుంది. అందువల్లనే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ఎకనమిక్ టైమ్స్ వార్తాకథనంపై అంత తీవ్రంగా ప్రతిస్పందించారని భావించవచ్చు.












Click it and Unblock the Notifications