మూడు రాజకీయ శక్తులు
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేట్లు లేదు. కాంగ్రెసుతో ప్రస్తుతం కలిసి వచ్చే పార్టీలేవీ లేవు. మజ్లీస్ మినహా దానికి మిత్రపక్షాలేవీ లేకుండా పోయాయి. గత ఎన్నికల్లో వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితిలతో కలిసి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కోవడానికి సిద్ధపడుతోంది. కాగా, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం నాయకత్వంలో ఒక కూటమి, నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరో కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ రెండు కూటములు కూడా కాంగ్రెసును ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి శతధా ప్రయత్నిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
సిపిఎం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే, సిపిఐ కొంత సమయం అడగడంతో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు సహకరించే లౌకిక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలో సిపిఎం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడింది. బిజెపిపై చిరంజీవి స్పష్టమైన ప్రకటన చేయడం లేదని, ఎన్నికల తర్వాతనైనా చిరంజీవి బిజెపి వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న సిపిఎం ఆయనతో కలిసి పనిచేయడానికి వెనకాడుతోంది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితితో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సిపిఎం నిర్ణయించుకుంది. కాంగ్రెసును ఓడించే లక్ష్యంతో తెరాసతో ఈ అవగాహనకు రావాలని భావిస్తోంది. తెరాస ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ ఈ కూటమితోనే వెళ్లడానికి ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యంతో అవగాహనకు వచ్చేందుకు సిపిఐ, నవ తెలంగాణ పార్టీ సిద్ధపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్యాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా సిపిఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవితో పొత్తు పెట్టుకోవడానికి సిపిఐ ఉవ్విళ్లూరుతోంది. దీనివల్ల ఉభయ కమ్యూనిస్టుల మధ్య స్నేహానికి గండి పడే అవకాశం ఉంది. కమ్యూనిస్టులు కలిసే పని చేస్తారని రెండు పార్టీలు చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే, వామపక్షాల ఐక్యత పేరుతో ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల్లో పరస్పరం మద్దతు ప్రకటించుకోవచ్చు. దీనివల్ల తాము పొత్తులు కుదుర్చుకున్న ఇతర పార్టీలపై ఎంతో కొంత దెబ్బ పడుతుంది. అయినా ఈ రెండు వామపక్షాల మధ్య ఖమ్మం జిల్లాలో సయోధ్య కుదరడం అంత సులభం కాదు. కాగా, ఎన్టీపి నేత దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. చిరంజీవి సామాజిక తెంలగాణను సాధిద్దామని ఇచ్చిన పిలుపు ఎన్టీపి ఎజెండాకు దగ్గరగా ఉంది. సామాజిక న్యాయం ఎజెండా తమకు అత్యంత ప్రధానమైందని దేవేందర్ గౌడ్ చెబుతూ వస్తున్నారు. చిరంజీవితో కలిసి పని చేసేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవడానికే ఇటీవల దేవందర్ గౌడ్ సిపిఐ కార్యదర్శి నారాయణతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఏమైనా రాష్ట్రంలో మూడు రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల్లో పోటీ పడేందుకు అన్ని హంగులనూ సిద్ధం చేసుకుంటున్నాయి. చిరంజీవికి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండడంతో, తెలుగుదేశం పార్టీ నందమూరి హీరోలను రంగంలోకి దింపింది. కాంగ్రెసు పార్టీ కృష్ణ కుటుంబ సభ్యులను, జయసుధను, జీవిత రాజశేఖర్ దంపతులను ప్రచార రంగంలోకి దింపుతోంది. వచ్చే ఎన్నికలు హోరాహోరీగానే జరుగుతాయనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications