కమలం'జిన్నా'భిన్నం

Jaswant Singh
లోకసభ ఎన్నికల ఓటమి భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని కుదిపేస్తోంది. బిజెపిలో ఒక్కొక్క నాయకుడే తిరుగుబాటు ప్రకటిస్తుంటే నాయకత్వం తీవ్రమైన సంక్షోభంలో పడింది. బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత ఎల్ కె అద్వానీలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. జస్వంత్ సింగ్ జిన్నాను సమర్థిస్తూ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను తప్పు పడుతూ రాసిన పుస్తకంతోనే గొడవ ప్రారంభం కాలేదు. ఓటమి చవి చూసిన మరుక్షణం నుంచే గొడవ ప్రారంభమైంది. ఓటమికి రాష్ట్ర నాయకత్వాలను బాధ్యులను చేసేందుకు అద్వానీ, రాజ్ నాథ్ లు ప్రయత్నిస్తున్న తరుణంలో, తిరిగి తమ కోటరీలోని వారికే పదవులు కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నాయకులు అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. దాన్ని తమ అధికారంతో అణచేయడానికి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. సైద్ధాంతిక నిబద్ధతకు, క్రమశిక్షణకు మారుపేరుగా పేరు పొందిన పార్టీలో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

జస్వంత్ సింగ్ జిన్నాను ప్రశంసిస్తూ రాసిన పుస్తకంతో కమలం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జస్వంత్ సింగ్ పార్టీనుంచి బహిష్కరించిన తీరు కూడా తీవ్ర విమర్శలకు గురైంది. నిజానికి, ఆయనపై చర్య తీసుకునే విషయంలో బిజెపి నాయకత్వం పద్ధతిని పాటించలేదు. జస్వంత్ కు షోకాజ్ నోటీసు జారీ చేయకుండానే, ఆయన వివరణ కోరకుండానే ఆయనపై వేటు వేసింది. అంత తొందరపడి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ లు ఎందుకు వ్యవహరించారనేది చాలా మందికి అర్థం కాని విషయం. అయితే పార్టీపై తమ పట్టు ఉందని ప్రకటించుకోవడానికి, మిగతా నాయకులు ముందస్తు హెచ్చరికగా జస్వంత్ పై ఏకపక్షంగా వేటు వేసినట్లు భావించవచ్చు. అయితే, జస్వంత్ పై చర్యకు భయపడే స్థాయి బిజెపిలో చాలా మందికి లేదని తేలిపోయింది.

ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అరుణ్ శౌరీ పార్టీ నాయకత్వంపై తీవ్రమైన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాజ్ నాథ్ ను బ్లండర్ లాండ్ లో అలైస్ గా అభివర్ణించారు. బిజెపిని హంప్టీ డంప్టీగా వ్యాఖ్యానించారు. మావో మాటలను తీసుకుని కేంద్ర కార్యాలయాన్ని ఢీకొట్టాలని అన్నారు. కాందహార్ ఘటనపై అద్వానీ చెప్పిన మాటలు అబద్ధమని కూడా తేల్చేయడానికి అసమ్మతి నాయకులు కంకణం కట్టుకున్నారు. కాందహార్ విమానం హైజాక్ ఘటనలో ఉగ్రవాదుల విడుదల విషయం తనకు తెలియదని అద్వానీ చెప్పిన మాటల్లో నిజం లేదని చెబుతున్నారు. ఆ విషయం అద్వానీకి తెలుసునని యశ్వంత్ సిన్హా, బ్రజేష్ మిశ్రా అన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అద్వానీకి ఆ విషయం తెలియడం లేదంటే తప్పంతా అప్పటి ప్రధాని వాజ్ పేయిదేనని చెప్పడమన్న మాట. కానీ, దాన్ని జీర్ణించుకోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు. దీంతో అద్వానీని మూలకు నెట్టే ప్రయత్న చేస్తున్నారు. గుజరాత్ అల్లర్ల సమయంలో వాజ్ పేయి మోడీపై చర్యకు సిద్ధపడ్డారని, కానీ అద్వానీ అడ్డుకున్నారని జస్వంత్ సింగ్ చెప్పారు.

వాజ్ పేయి తర్వాత పార్టీని విజయపథంలో నడిపి ప్రధాని పదవి చేపట్టాలని ఆశించిన అద్వానీకి చుక్కెదురు కావడమే కాకుండా సొంత పార్టీలోనే ముసలం మొదలై ఆయన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే పరిస్థితి వచ్చింది. బిసి ఖండూరీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. రాజస్థాన్ విపక్ష నేత వసుంధర రాజే సింధియా నాయకత్వం మాట వినడానికి వెనకాడుతున్నారు. ఈ స్థితిలో రాజ్ నాథ్ సింగ్ గురువారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ను కలుసుకున్నారు. ఫలితం ఏమిటో తెలియడం లేదు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుదర్శనం జిన్నాపై జస్వంత్ వ్యాఖ్యలను సమర్థించారు.

మొత్తం మీద, బిజెపి వ్యవహారం పైకి కనిపించేత మామూలుగా లేనట్లు అనిపిస్తోంది. తీవ్రమైన సైద్ధాంతిక విబేదాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు కూడా అనిపిస్తోంది. దేశ విభజన విషయంలో నెహ్రూను, సర్దార్ పటేల్ ను దోషులుగా నిలబెట్టి, జిన్నాను సమర్థించడం ద్వారా ముస్లిం సమాజం మద్దతు సంపాదించడానికి, కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికి అవసమైన సైద్ధాంతిక భూమికకు ప్రచారం కల్పించే పనిని బిజెపిలోని, సంఘ్ పరివార్ లోని ఒక వర్గం పూనుకున్నట్లు భావించవచ్చు. జిన్నాను సమర్థిస్తూ ఆర్ఎస్ఎస్ నేత శేషాద్రి గతంలోనే ఒక పుస్తకం రాశారు. పాత ఆయుధాన్ని కొత్తగా తీయాలనే వర్గం ఒకటి తయారైనట్లు చెప్పవచ్చు. ఈ స్థితిలో అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ ల పరిస్థితి ఎటూ కాకుండా పోతుందా, ఆలోచించాల్సిన విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+