బాబుకు వైయస్ జగన్ భయం

వైయస్ జగన్ పార్టీ పెడితే తెలుగుదేశం ప్రథమ శ్రేణి నాయకుల మాట ఎలా ఉన్నా ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద యెత్తున వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీలో సీనియర్లు తిష్ట వేసుకుని కూర్చోవడం అందుకు ఒక కారణంగా చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో సీనియర్లే పోటీ చేస్తున్నారు. వారి వల్ల ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం లభించడం లేదు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇతర పదవులు కూడా వారికి దక్కడం లేదు. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనైనట్లు భావిస్తున్నారు. సీనియర్లను కాదని తమకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో జగన్ పార్టీ పెడితే అందులో చేరి అవకాశాలను రాబట్టుకోవాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. పరిస్థితులను పరిశీలిస్తే, తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద యెత్తున వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఎక్కువగా తెలుగుదేశం క్యాడర్ తోనే వైయస్ జగన్ రాయలసీమలోనూ కోస్తాంధ్రలోనూ ప్రాబల్యం సాధించే అవకాశాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ క్యాడర్ కూడా ఎక్కువ సంఖ్యలో వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలో మార్పు రాకపోవడం, పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన చర్యలూ తీసుకోకపోవడం వారిని నిరాశకు లోను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమలో చిరంజీవి క్యాడర్ మొత్తం జారిపోయినట్లు భావిస్తున్నారు. ఏమైనా, వైయస్ జగన్ పోరు కాంగ్రెసుతోనే ఉంటుందా, చంద్రబాబు నామమాత్రం అవుతారా అనే ప్రశ్నలకు సమాధానాల కోసం వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications