చంద్రబాబు తెలంగాణ మిస్ ఫైర్

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీలో ధర్నా చేస్తున్న సమయంలోనే కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నాకు దిగి అరెస్టయ్యారు. తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నాకు దిగారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ఢిల్లీ యాత్రలోని లోపాలను ఎత్తి చూపడానికి, తెలుగుదేశం పార్టీ వైఖరిని తప్పు పట్టడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ టీవీ చానెల్, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చెందిన రాజ్ న్యూస్ పోటీ పడ్డాయి. చంద్రబాబు వైఖరిని తేల్చకుండా ఢిల్లీ యాత్ర చేపట్టడంపై రాజ్ న్యూస్ తప్పు పడుతూ వార్తాకథనాలను ప్రసారం చేసింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల కార్యక్రమంలో చిత్తశుద్ధి లేదంటూ నిరూపించడానికి సాక్షి ఒకటి రెండు సంఘటనలను ఎత్తి చూపింది. వీటితో పాటు కాంగ్రెసు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకలకు ప్రతివ్యూహాన్ని రచించి అమలు చేసింది. తెలంగాణపై చంద్రబాబు వైఖరి స్పష్టం చేస్తే పార్లమెంటులో తాము తెలంగాణ బిల్లు పెట్టిస్తామని జీవన్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు సవాల్ చేశారు. ఇలా వ్యతిరేక పార్టీలు, మీడియా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆటంకంగా మారాయి.
తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా వార్తాకథనాలు ప్రసారం చేయడానికి కొన్ని టీవీ చానెళ్లు ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. చంద్రబాబుకు అనుకూలంగా వార్తాకథనాలను ప్రసారం చేస్తున్న స్టూడియోఎన్ కు వార్తాకథనాల రూపుకల్పనలోని బలహీనత ఉంది. విషయ పరిజ్ఝానం, వార్తల కోణాలను అందించే తెలివితేటలు గల జర్నలిస్టుల లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలమే అయినా డబ్బా వాయించే స్థితిలో లేవు. అందువల్ల చంద్రబాబుకు తీవ్రమైన కష్టాలే ఎదురవుతున్నాయి. దానికితోడు, తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందనే చంద్రబాబు ప్రకటనను గానీ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల ప్రకటనను గానీ నమ్మే స్థితి లేకుండా పోయింది. తాము తెలంగాణకు పార్టీ అనుకూలంగా లేదని, తెలంగాణకు అనుకూలంగా ఉందేనేది తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల అభిప్రాయం మాత్రమేనని తెలుగుదేశం కోస్తాంధ్ర నాయకుడు బుచ్చయ్య చౌదరి ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీలో ఎవరేం చెప్పినా సీమాంధ్ర నాయకుల ప్రాబల్యమే కొనసాగుతుందని, తెలంగాణ ప్రాంత నాయకుల పప్పులు ఉడకవని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. దీంతో తెలంగాణపై ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి గానీ, పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులకు గానీ ప్రజల మద్దతు లభించే అవకాశాలు లేవు.












Click it and Unblock the Notifications