జగన్ మొండికేయడం వల్లనే..

వైయస్ జగన్ ఏ మాత్రం తన వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఓదార్పు యాత్రను చేపట్టి తీరాల్సిందేననే వాదనతోనే ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్రలో సోనియా పేరును గానీ, ఇతర కాంగ్రెసు నాయకుల పేర్లను గానీ ప్రస్తావించకుండా కేవలం వైయస్ రాజశేఖర రెడ్డి పేరును మాత్రమే ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి కె. రోశయ్యపై విమర్సలు చేయడాన్ని బట్టే జగన్ మరో ఆలోచనతో ఉన్నట్లు ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది.
జగన్ తీరు చూశాక ఎదురు దాడికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి ఎపిఐఐసి కుంభకోణం గురించి మాట్లాడారని చెబుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కు ఆ భూములు అప్పగించిన సమయంలో ఎపిఐఐసి చైర్మన్ గా జగన్ కు అధికార ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు ఉండడం వారి ఆరోపణలకు మరో కారణంగా చెబుతున్నారు. డిఎల్, జెసిలపై అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రస్తుత తరుణంలో జగన్ పై ప్రత్యక్ష, పరోక్ష యుద్ధానికి అధిష్టానం సిద్ధపడుతోంది. వైయస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని లావాదేవీలను ఒక్కొక్కదాన్నే ముందుకు తెచ్చి జగన్ వర్గాన్ని ఇరకాటంలో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైయస్ జగన్ ఆస్తులపై కూడా అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. జగన్ ఇక నేరుగా రంగంలోకి దిగి అధిష్టానాన్ని ఢీకొనాల్సిందే.












Click it and Unblock the Notifications