తెలంగాణ: వెలమ వర్సెస్ రెడ్డి

Telangana
తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలు వెలమలకు, రెడ్లకు మధ్య సంఘర్షణగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంపై ఈ రెండు అగ్రకులాలు ఆధిపత్యం సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వెలమ రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వెనక నడస్తుండగా, రెడ్డి కులానికి చెందిన రాజకీయ నాయకులు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల్లో కొనసాగుతూ తెలంగాణ ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు, ఈ రెండు అగ్రకులాలకు నాయకత్వాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో దళితులు తెలంగాణ ప్రజ ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ వెనక ర్యాలీ అవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెసుకు అదనంగా బిసీలు, దళితుల బలం కూడా ఉంది. ఈ పోరులో కెసిఆర్ అగ్రభాగాన ఉన్నారని చెప్పవచ్చు. కాంగ్రెసుతో కాస్తో కూస్తో అవగాహనతో కెసిఆర్ పనిచేస్తుండగా తెలుగుదేశం నాయకుల పట్ల ఆయన పూర్తి వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కమ్మ కుల ఆధిపత్యంలో కొనసాగుతుండడం అందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే, చంద్రబాబు మాత్రం తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని దళిత బహుజనుల చేతుల్లో పెట్టకుండా నాగం జనార్దన్ రెడ్డి చేతులో పెట్టడం వెనక పెద్ద వ్యూహమే ఉందని భావిస్తున్నారు. కెసిఆర్ ను అంగీకరించని రెడ్ల సెక్షన్ పెద్దగానే ఉంది. వారందరినీ తన వైపు మలుచుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ పని చేశారని అంటున్నారు.

కింది స్థాయిలో రెడ్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తున్నారు. అటువంటి రెడ్లు చాలా మటుకు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆ క్యాడర్ ను రక్షించుకోవడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులది పైచేయి అవుతుందని, గ్రామాల్లో తాము మరింతగా ఆధిపత్యం కోల్పోతామని భావించడం వల్లనే కింది స్థాయిలో రెడ్లు తెలంగాణ రాష్ట్రం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని వారు బయటకు చెప్పడం లేదు. అలా చెప్పడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే వారు మాట్లాడడం లేదు. మొదటి నుంచి తెలంగాణలో రెడ్లు, వెలమలు రాజకీయంగా ప్రాబల్యాన్ని సంపాదించుకున్నారు. తెలంగాణలోని విప్లవోద్యమ ప్రభావం వల్ల గ్రామాల్లో దొరతనం నెరిపిన రెడ్లు, వెలమలు, కరణాలు హైదరాబాదు వంటి నగరాలకు తరలి వెళ్లిపోయారు. అయినా, రాజకీయంగా వారు గ్రామాల్లో తమ పట్టును కోల్పోలేదు. రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాపాడుకుంటూ చట్టసభలకు వారే వస్తున్నారు. విప్లవ రాజకీయాలు పార్లమెంటరీ రాజకీయాల పట్ల వైముఖ్యం ప్రదర్శించడం వల్ల కూడా అది కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో రాజకీయ సమీకరణాలు తారుమారవుతున్నాయి.

మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం నారాయణ రెడ్డి వంటి వారు తొలుత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి అక్కడ ఇమడలేక బయటకు వచ్చారు. చాలా మంది రెడ్డి కులం నాయకులకు అదే అనుభవం ఎదురైంది. మరోవైపు, కెసిఆర్ కు ఇతర పార్టీల్లోని వెలమ నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. పార్టీలు వేరైనా వారు కెసిఆర్ ను లోలోపల సమర్థిస్తూనే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ రావడానికి ఇదో కారణంగా భావించవచ్చు. కెసిఆర్ అదనపు బలం కూడా చేకూరింది. విప్లవ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన రెడ్లు కెసిఆర్ కు అండగా నిలబడ్డారు. కోదండరామ్ దళిత అవగాహనతో తన పేరు నుంచి రెడ్డిని తొలగించుకున్న విషయం తెలిసిందే. విప్లవ రాజకీయాలకు స్వస్తి చెప్పిన వారు తమ రాజకీయ అవగాహన వల్ల, ఏదో మేరకు తమ కులవాసనలకు దూరం కావడం వల్ల, ఇతర పార్టీల్లోని రెడ్లు వారిని తమతో సమానంగా చూడకపోవడం వల్ల వారు కెసిఆర్ తో ఉండగలుగుతున్నారని అనుకోవాలి. రాజకీయాల్లో వీరు కొత్త శక్తిగా తెరాస వల్ల ముందుకు వచ్చారని భావించవచ్చు. ఈ రకంగా తెలంగాణ ఉద్యమంలో కుల సమీకరణాలు పని చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆధిపత్యం సాధించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+