పార్టీల ఫ్యాక్టరీ తెలుగుదేశం

ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించటం టిడిపి పగ్గాలు చంద్రబాబు చేతికి చకచకా వెళ్లాయి. ఎన్టీఆర్ మృతి అనంతరం చంద్రబాబును ఎలాగైనా ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. ఎన్టీఆర్ స్థాపించి బాబు చేతిలో ఉన్న టిడిపిని ఢీకొనలేక పోయారు. అనంతరం బావతో విభేదాలు వచ్చిన నందమూరి హరికృష్ణ సైతం అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన కూడా బాబును ఎదుర్కోలేక పోయారు. టిడిపి సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, వసంత నాగేశ్వర రావు, కెఇ కృష్ణమూర్తి తదితరులు సైతం వేరు కుంపటి ప్రయత్వాలు చేశారని అవి సఫలం కాలేదని సమాచారం. ఆ తర్వాత 2001లో తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో నాటి డిప్యూటీ స్పీకర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ నుండి బయటకు వచ్చారు. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటును ఒడిసి పట్టుకున్నారు. అప్పటికే 1997లో భారతీయ జనతా పార్టీ ఒక వోటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసింది.
ఆ తర్వాత పలు ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ఆదే సమయంలో కెసిఆర్ బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పటికే ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా టిఆర్ఎస్ బలం పుంజుకుంది. టిడిపి నుండి బయటకు వచ్చిన వారిలో చాలామంది పార్టీలు స్థాపించినప్పటికీ ఇప్పటి వరకు టిఆర్ఎస్ ఒక్కటే రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టిడిపి, కాంగ్రెసులకు గట్టి పోటీని ఇవ్వగలుగుతోంది. టిడిపి ద్వారా పైకెదిగిన కెసిఆర్ టిఆర్ఎస్ ద్వారా ఇప్పుడు టిడిపినే ఇరుకున పెట్టి ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసే స్థాయికి ఎదిగారు. టిఆర్ఎస్ తర్వాత టిడిపిలో చంద్రబాబు తర్వాత స్థానంలో ఉన్న దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ స్థాపించారు. అయితే అప్పటికే తెలంగాణ కోసం ఓ ప్రత్యేకమైన పార్టీ ఉండటంతో నవతెలంగాణ క్లిక్ కాలేదు. దీంతో దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేయడం, అక్కడ ఇమడలేక తిరిగి సొంత గూటిలోకి రావడం చకచకా జరిగిపోయాయి.
ఇక కొత్తగా నాగం జనార్దన్ రెడ్డి మరో పార్టీని స్థాపించే యోచనలో ఉన్నారు. ఆయన పెట్టే పార్టీ పేరు తెలంగాణ తెలుగుదేశంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మరి నాగం ఇటు తెలంగాణ కోసం ఇప్పటికే పోరాడుతున్న టిఆర్ఎస్‌ను, తెలంగాణలో సంప్రదాయ ఓటు బాగా ఉన్న టిడిపిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. టిడిపి పార్టీల ఫ్యాక్టరిగానే కాకుండా పలువురు ముఖ్య నేతలను ఇతర పార్టీలకు అందించిన ఘనతనూ దక్కించుకుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన సి.రామచంద్రయ్య, శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, గంటా శ్రీనివాస రావు, బండారు సత్యానంద రావు చేరారు. టిడిపిలో మంత్రిగా, డిప్యూటి స్పీకర్‌గా పని చేసిన కెసిఆర్ ఓ పార్టీని స్థాపించి తెలంగాణ ప్రాంతంలో కీలకంగా మారారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుకు టిడిపి నుండి హేమాహేమీలు వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెసులో చక్రం తిప్పుతున్న మంత్రి జానారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, సర్వే సత్యనారాయణ తదితరులు టిడిపి నుండి వెళ్లిన వారే. ఇటీవల కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ మినహా పుట్టిన పార్టీలన్నీ టిడిపి నుండే కావడం విశేషం.












Click it and Unblock the Notifications