ఎవరీ బాబా రామ్‌దేవ్?

నల్లటి గడ్డం, పొడవైన తల వెంట్రుకలు, వాటిని ముడిచి కొప్పు పెట్టే పద్ధతి ఆయన ప్రత్యేకత. అతి క్లిష్టమైన యోగాసనాలను ప్రదర్శించడం ఆయన విశిష్టత. డెహ్రాడూన్ సమీపంలో హరిద్వారాలో గల ఆయన సంస్థలకు ప్రజలు పెద్ద యెత్తున వచ్చిపోతుంటారు. యోగా, ఆయుర్వేదం ద్వారా అన్ని జబ్బులకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెబుతారు. ఎయిడ్స్, క్యాన్సర్ వ్యాధులకు కూడా తన వద్ద మందులున్నాయని ప్రకటించడం ద్వారా ఆయన వివాదస్పదంగా మారారు. అయితే, ఎయిడ్స్ రోగులు యోగా ద్వారా ఊరట పొందవచ్చునని మాత్రమే తాను చెప్పానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
టెలివిజన్ చానెళ్లలో విస్తృతంగా కనిపించే బాబాకు రాజకీయాకాంక్ష కూడా ఉంది. సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి తాను రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఆయన ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన పార్టీ అభ్యర్థులు మాత్రం 543 సీట్లకు పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రణాళిక మారినట్లు ఉంది. అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టారు.
బాబా రామ్‌దేవ్ 1965లో హర్యానాలోని అలిపూర్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు రామకిషన్ యాదవ్. రామకిషన్ పాఠశాలలో 8న తరగతి వరకు చదివారు ఆ తర్వాత హరిద్వారాకు మారి ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వడం, పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఆయన హిందూ ప్రాచీన గ్రంథాలను చదివారని, వివిధ గురుకులాల్లో వాటిని బోధించారని అంటారు. రామ్‌దేవ్ పలు ట్రస్టులు, గురుకులాలు, ఫౌండేషన్స్ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిబిరాలు నిర్వహిస్తున్నారు .ప్రాణాయామ అతను ప్రదర్శించే యోగాసనాల్లో అతి ముఖ్యమైంది. సామూహిక యోగాసనాల కార్యక్రమం టెలివిజన్‌లో ప్రసారం కావడంతో 1995లో ఆయనకు ప్రజాదరణ పెరగడం ప్రారంభమైంది. అప్పుడప్పుడు ఆయన స్వదేశీ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటారు.












Click it and Unblock the Notifications