బాబు ప్లాన్: ఎన్టీఆర్ ముద్ర చెరిపేయడానికేనా?

చంద్రబాబు ధోరణి వల్లనే నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. గత ఎన్నికల నుంచే చంద్రబాబు ఎన్టీ రామారావు ముద్రను చెరిపేయడానికి, ఎన్టీఆర్‌పై అభిమానంతో నందమూరి హరికృష్ణకు సన్నిహితంగా మెలుగుతున్న నాయకులను వెనక్కి నెట్టడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని అంేటున్నారు. గత ఎన్నికల్లో గన్నవరం సీటును ఆశించిన విజయవాడ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీకి ఆ సీటును కేటాయించకుండా విజయవాడ పార్లమెంటు టికెట్ ఇచ్చారనే భావన ఉంది. గన్నవరం నియోజకవర్గంలో అప్పటికే వంశీ తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా ఆయనకు ఆ స్థానం కేటాయించకపోవడంలోని ఆంతర్యం అదేనని చెబుతారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జయరమేష్ సోదరుడు బాలవర్ధన రావుకు గన్నవరం శాసనసభా స్థానం టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వంశీ అప్పట్లో సిద్ధపడ్డారని అంటారు. అయితే, పోటీ నుంచి తప్పించడానికి వంశీకి విజయవాడ పార్లమెంటు సీటు కేటాయించారని చెబుతారు. కేవలం 15 రోజుల ముందు వంశీకి విజయవాడ టికెట్ ఇచ్చారు. దానికి తోడు, వంశీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ సహకరించలేదనే విమర్శ ఉంది.
పైగా, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావు ఏ సమాచారం కూడా కొడాలి నానికి గానీ, వంశీకి గానీ ఇచ్చేవారు కారని అంటారు. దీనిపై వారిద్దరు చంద్రబాబుకు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. పైగా, దేవినేని ఉమా మహేశ్వర రావునే చంద్రబాబు ప్రోత్సహించారనే అభిప్రాయం ఉంది. దీంతో వంశీ, నాని తీవ్ర అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వంశీకి కూడా దేవినేని ఉమా మహేశ్వర రావు ఏ సమాచారం ఇచ్చేవారు కాదని అంటారు.
జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విడుదల రోజే పోర్టు సాధన కోసం ఉమా మహేశ్వర రావు అఖిల పక్షం సారథ్యంలో కృష్ణా జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చారు. దీంతో అగ్గి రాజుకుంది. వల్లభనేని వంశీ దేవినేని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దేవినేని ఉమా మహేశ్వర రావు నాయకత్వం కింద పనిచేయలేనని చెప్పారు. అయితే, వంశీ ఆ తర్వాత చల్లబడ్డారు. అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తొలుత పార్టీ నుంచి కొడాలి నాని బయటపడ్డారు. నిజానికి వంశీ ముందుగా బయటకు వస్తారని అనుకున్నారు. కానీ, వంశీ పార్టీలో కొనసాగడం అంత సులభమేమీ కాదనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications