తెరాస సవాల్, పంతం నెగ్గించుకున్న చంద్రబాబు

పాలకుర్తి బహిరంగ సభలో ఆయన ప్రసంగం కూడా తెరాసను టార్గెట్ చేసుకుని సాగింది. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను క్రమం తప్పకుండా తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా వైదికపైకి కొంత మంది చెప్పులు విసిరారు. సభలో గందరగోళం సృష్టించారు. వారిపై ఆయన నిప్పులు చెరిగారు. రైతు పోరుబాటు పేరుతో ఆయన చెప్పినప్పటికీ తాను తెలంగాణలో పర్యటించడమనేదే ఆయన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. తెరాస, తెలంగాణ జెఎసి విసురుతున్న సవాళ్లను అధిగమించడం ఎలా అనేదే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా వేదికపై నుంచి ప్రసంగించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరి, టి. దేవేందర్ గౌడ్ తదితర తెలంగాణ నాయకులు కెసిఆర్‌పై, తెరాసపై నిప్పులు చెరిగారు. తెరాస టార్గెట్‌గానే బహిరంగ సభ నుంచి ప్రసంగాలు సాగాయనే విమర్శ ఉంది. ఏమైనా, చంద్రబాబు మాత్రం తన పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications