ఏం జరుగుతోంది: జుట్టు పీక్కుంటున్న నేతలు!

అసలు మార్పుపై అధిష్టానం మనసులో ఏముందో తెలుసుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. సీనియర్ మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరంతో జరగనున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆనం హాజరవుతున్నప్పటికీ 'మార్పు' అంశాన్ని కూడా ఆయన తెలుసుకోనున్నారట. డిఎల్ కూడా ఈ విషయాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారట.
వీరితో పాటు పలువురు ముఖ్య నేతల అందరి చూపూ ఢిల్లీ వైపే ఉంది. నాయకత్వ మార్పుపై వస్తున్న కథనాల గురించి పలువురు నేతలు బుధవారం కిరణ్‌ను కలిసి ఆరా తీశారట. ముఖ్యమంత్రిని కలసిన వారిలో మాజీ మంత్రులు జెసి దివాకర రెడ్డి, పాలడుగు వెంకట్రావు, గాదె వెంకట రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పలువురు మంత్రులు కూడా సిఎంతో భేటీ అయ్యారు. అయితే నాయకత్వ మార్పుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిరణ్ వారితో చెప్పారట.
మరోవైపు ఎమ్మెల్యే కెఎల్ఆర్ నేతృత్వంలో అధిష్ఠానం వద్దకు ఓ బృందం వెళ్లడం పైనా ఆరా తీస్తున్నారట. తాను కెఎల్ఆర్ బృందాన్ని పంపలేదని ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి వస్తోందట. అదే విధంగా తన విషయంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని కిరణ్ చెబుతున్నారట. అధిష్ఠానానికి తనను మార్చే ఉద్దేశం లేదన్న సంకేతాలను ఇచ్చేందుకు డిసెంబర్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రులతో కిరణ్ చర్చించారని అంటున్నారు.
డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ మార్పుపై వారు చర్చించారట. వీరిద్దరూ కిరణ్ వ్యతిరేక వర్గం ముద్రపడ్డారు. కిరణ్‌ను తొలగించాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు తేల్చి చెప్పానని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చెబుతున్నారట. ఈ నెలాఖరులోగా సిఎంను మార్చకుంటే.. తన దారి తాను చూసుకుంటానని అధిష్ఠానంకు ఆల్టిమేటం కూడా జారీ చేశారట.
కొసమెరుపు ఏమంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మార్పు ఉండదని నేతలకు చెబుతున్నప్పటికీ.. ఆయన కూడా
ఆందోళనలో ఉన్నారట.












Click it and Unblock the Notifications