జగన్‌పై దూకుడు: ఇరుక్కు పోయిన కాంగ్రెసు

వైయస్‌ను వ్యతిరేకించే నేతలు, అభిమానించే నేతలు పార్టీలో అంతే సంఖ్యలో ఉండటంతో ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదంటున్నారు. వైయస్‌ను విమర్శించి తీరాల్సిందేననే లైన్ తీసుకొంటే పార్టీలో ఆయనను అభిమానించే వారంతా జగన్‌కు దగ్గరయ్యే ప్రమాదం ఉందేమోనన్న ఆందోళనను నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయమై కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ ఇప్పటికే స్పష్టమైన హెచ్చరిక కూడా చేశారు. వైయస్‌ను విమర్శించాల్సిన పరిస్థితే వస్తే కాంగ్రెస్‌ను వీడేందుకైనా తాను వెనకాడబోనని ఆయన తేల్చి చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి కూడా పార్టీని వీడనప్పటికీ తన సోదరుడిని అంటే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
ఇక, అలాకాకుండా జగన్‌ను అవినీతిపరుడిగా విమర్శిస్తూ వైయస్‌ను మాత్రం పొగడాలన్న నిర్ణయానికి వస్తే వైయస్‌ను వ్యతిరేకించే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారట. మొత్తం మీద వైయస్ విషయం కాంగ్రెసుకు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న విధంగా తయారయిందని అంటున్నారు. వైయస్ మరణానంతరం జగన్‌ను పల్లకీపై మోయకుండా సాధారణ ఎంపిగా చూసి ఉంటే పార్టీకి ఈ రోజు ఈ కష్టాలు వచ్చేవి కావని పార్టీలో వినిపిస్తోందంట.
వైయస్ మరణించిన నాటి నుంచి కొందరు ప్రజా ప్రతినిధులు జగన్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముద్ర వేయడంతో పార్టీకి చాలా నష్టం వాటిల్లిందని పార్టీలో వాదన వినిపిస్తోందంట. ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య బాధ్యత నిర్వహిస్తున్న సమయంలో ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగానే భావిస్తూ ఎప్పటికైనా జగన్ సిఎం అవుతారని భజన చేస్తూ రావడంవల్లే కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులకు అస్ధిత్వం లేకుండా పోయిందని పార్టీ నేతలు చెబుతున్నారని అంటున్నారు.
అందువల్ల పార్టీలో మరో నేతను సిఎంగా పూర్తి స్థాయిలో ఆమోదించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారంనాటి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో పలువురు నేతలు లేవనెత్తిన అంశాలు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. వైయస్ రాజశేఖర రెడ్డిని ఆయన కుమారుడు జగన్‌ను వేరుగా చూడలేమన్న వాదనతో కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా ఏకీభవిస్తున్నా బాహాటంగా మాత్రం దాన్ని సమర్థించలేని స్థితిలో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు వైయస్‌ను విమర్శిస్తే ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు ఊతమిచ్చినట్లు కూడా ఉంటుందని వారు భావిస్తున్నారట. ఈ పరిస్థితిను చూస్తే ఎలా చూసినా తమకే నష్టం జరుగుతుందని కాంగ్రెసు పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. విమర్శిస్తే కాంగ్రెసుకు నష్టం అదే సమయంలో టిడిపికి లాభం, పొగిడితే జగన్‌కు లాభం. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట.












Click it and Unblock the Notifications