ప్రాదేశికం: కిరణ్ రెడ్డికి కొంత తీపి, కొంత చేదు
హైదరాబాద్: ప్రాదేశిక ఫలితాల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గం ఆయన సొంత మండలమైన కలికిరికే పరిమితమైంది. ఈ ఎన్నికల నాటికి జైసమైక్యాంధ్ర పార్టీ ఏర్పడలేదు. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు కిరణ్ కుమార్ రెడ్డి మద్దతిచ్చారు.
నియోజకవర్గంలోని కలికిరి తప్ప మిగిలిన వాల్మీకిపురం, పీలేరు, కేవీపల్లె మండలాల్లో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. మరో ఆరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. కలికిరిలో మెజారిటీ స్థానాల్లో కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుదారులు విజయం సాధించారు. ఎంపిపి పదవితోపాటు జడ్పీటీసీ స్థానాన్నీ కిరణ్ కూమార్ రెడ్డి వర్గీయులు సొంతం చేసుకున్నారు. గుర్రంకొండ ఎంపిపి స్థానాన్నీ కైవసం చేసుకోగలిగారు.

చిత్తూరు జిల్లా కలికిరి-4 ఎంపిటిసి స్థానం నుంచి జేఎస్పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు(అన్న) నల్లారి ఆనందరెడ్డి ఓటమిపాలయ్యారు.అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కిరణ్ వర్గం కైవసం చేసుకున్నా, ఎంపీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆనందరెడ్డి ఓడిపోయారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి మండలంలో 13 ఎంపిటిసి స్థానాల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయిన తెలుగుదేశం ఏకంగా జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. జెడ్పీటీసీ స్థానంలో టిడిపి అభ్యర్థి శైలజను కాంగ్రెస్ బలపర్చగా, సిపిఎం అభ్యర్థి అంజలిని వైయస్సార్ కాంగ్రెసు బలపర్చింది. కాగా, శైలజ భర్త చిర్రావూరు ఎంపిటిసి స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications