ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి మీడియా దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, రాధాకృష్ణకు చెందిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్లే చిరంజీవికి కొరకరాని కొయ్యగా ఉండేవి. చిరంజీవికి వ్యతిరేకంగా సందు దొరికినప్పుడల్లా వార్తాకథనాలను గుప్పిస్తూ వస్తున్నాయి. ఇప్పడు వాటికి మరో చానెల్ తోడైంది. అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి చెందింది. స్టూడియో ఎన్ చానెల్ కూడా చిరంజీవిపై దుమ్మెత్తిపోస్తోంది. తనకు అధికారం దూరం చేశారని చిరంజీవిపై చంద్రబాబుకు మంటగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. స్టూడియోఎన్ సహకారంతో చంద్రబాబు చిరంజీవిపై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ స్థితిలో మనమో చానెల్ పెడదామంటూ కొంత మంది చిరంజీవికి సూచించారట. ఆ చానెల్ ద్వారా ఎదురుదాడి చేస్తూ కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులను ముప్పు తిప్పలు పెట్టవచ్చునని సూచించారట. ఏమో, చిరంజీవి కదులుతారా, ఆయన దృష్టంతా ఇప్పుడు తాను నటించబోయే సినిమాపైనే ఉందని అంటున్నారు.