ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోనియా గాంధీతో రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఆయన రహస్యంగా సోనియాను కలిసినట్లు తెలుస్తోంది. సోనియాను చిరంజీవి అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే కాంగ్రెసుతో ఓ ఒప్పందానికి వచ్చిన చిరంజీవి భవిష్యత్తు కార్యక్రమంపై సోనియాతో చర్చించినట్లు సమాచారం. రోశయ్య మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీకి ఇచ్చే మంత్రి పదవులపై వారిద్దరి మధ్య మంతనాలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చిరంజీవి సోనియాతో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలపై కూడా సోనియా చిరంజీవితో మాట్లాడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కాంగ్రెసు ద్వారా చిరంజీవికి రాజయోగం పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.