ప్రతి సందర్భంలో వివాదం సృష్టించడం కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు అలవాటుగా మారినట్లు ఉంది. తెలంగాణపై ఏదో ఒక కామెంట్ చేయడం తెలంగాణ నేతలతో మొట్టికాయలు తినడం ఆయనకు సరదా కావచ్చు. తాజాగా ఆయన తెలంగాణ విమోచన దినోత్సవంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అది విమోచన దినం కాదని, విలీన దినమని ఆయన భాష్యం చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో లగడపాటి తన మేధస్సును ప్రయోగించి దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో తెలంగాణ నాయకులు ఆయన భగ్గుమన్నారు. లగడపాటికి పిచ్చి పట్టిందని తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలకు కూడా పనికి రాని లగడపాటి పార్లమెంటుకు వెళ్లి తానేదో పొడిచేశానని అనుకుంటున్నారనే పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటిని మీడియా బహిష్కరించాలని బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులైతే ఆయనను పురుగును తీసేసినట్లు తీసేశారు. ఇతర పార్టీల నాయకుల వ్యాఖ్యలను పక్కన పెడితే సొంత పార్టీ నాయకులు కూడా ఆయనపై రుసరుసలాడారు. నువ్వే తీస్ మార్కాడివని (మొనగాడివి) అని అనుకోవద్దని కాంగ్రెసు ఎంపిల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆయనకు సలహా ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తే నిమ్స్ లో పరిగెత్తినట్లుగా పరుగెత్తాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ విషయాలు నీకెందుకని అడిగారు. అయితే, తెలంగాణ నాయకులకు సమస్యలు తలకు చుట్టుకుంటుంటే లగడపాటి సరదాకు ఆటలు ఆడుకుంటున్నారా అనే సందేహం కలగక మానదు.