తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బాటలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పయనించాలని నిర్ణయించుకున్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ద్వారా స్ఫూర్తి పొందిన ఆయన తాను కూడా ఓ యాత్ర చేపట్టాలని అనుకుంటున్నారు. అయితే, అది జగన్ యాత్రలాంటిది కాదు. ఆయన అక్టోబర్ 2వ తేదీనుంచి రాష్ట్రంలో బాపూజీ సద్భావనా యాత్ర నిర్వహిస్తారు. గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే ఆయన యాత్ర నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీ వరకు జరుగుతుంది. యాత్ర సందర్భంగా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆయన గతంలో 2004, 2007ల్లో అటువంటి యాత్రలు చేశారు. తన సొంత నియోజక వర్గం ప్రజల సమస్యలను లగడపాటి తీరిస్తే చాలునని, రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని లగడపాటి అంటే గిట్టని వారంటున్నారు.