ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి వ్యతిరేకంగా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంది. తిరుపతిలోని మురికివాడల ప్రజలను చిరంజీవి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టింది. తిరుపతి నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన మురికివాడల ప్రజలను కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శించింది. మురికివాడల ప్రజలతో చిరంజీవి తమను పట్టించుకోవడం లేదంటూ మాట్లాడించింది. చిరంజీవి ఓట్ల కోసం తమ వద్దకు వచ్చారని, ఆ తర్వాత తమను మరిచిపోయారని ఓ మహిళ సాక్షి టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. తిరుపతి శాసనసభా నియోజకవర్గంపై వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డి కన్నేశారు. చిరంజీవిపై గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ స్థితిలో ఇప్పటి నుంచే కరుణాకర్ రెడ్డికి తగిన పునాదిని ఏర్పాటు చేయడానికి తిరుపతిలో చిరంజీవిపై సాక్షి టీవీ చానెల్ వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఏమైనా, చిరంజీవికి ఇది కొంత నష్టం కలిగించే విషయమే.