కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్న వైయస్ జగన్ ను పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీగా పోలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ హవా నడుస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ ఓ ఊపు ఊపుతారని భావిస్తున్నారు. సాక్షి టీవీ చానెల్ స్వయంగా ఈ ప్రచారాన్ని సాగిస్తోంది. ఈ రకంగా మీడియా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ చానెల్ పని కట్టుకుని ప్రసారం చేస్తోంది. నిజానికి, వామపక్ష ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెసు మమతా బెనర్జీతో జత కట్టింది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి వాడుకుంది. చాలా కాలంగా పోరాటం చేస్తున్నా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కావాలనే మమతా బెనర్జీ ఆశలు ఇంకా ఫలించలేదు. 2014లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తానని విశ్వసిస్తున్న వైయస్ జగన్ స్వయంగా అధికారంలోకి రాలేరా అనే సందేహం కలుగుతోంది. కాంగ్రెసు సహకారంతోనే తాను ముఖ్యమంత్రిని అవుతానని పరోక్షంగా చెబుతున్నట్లు భావించాల్సి ఉంటుందా అనేది ప్రశ్న.