బాబు, షర్మిలకు కౌంటర్: కిరణ్ రెడ్డి పాదయాత్ర?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ షర్మిలలను కౌంటర్ చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తగిన కార్యక్రమం కోసం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి బహిరంగంగానే తప్పు పడుతున్నారు. ఆదివారం రాత్రి సీమాంధ్ర మంత్రులతో జరిగిన సమావేశంలో తాను పాదయాత్ర చేయాలని అనుకుంటున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారట. అయితే, కొంత మంది మంత్రులు దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది.

పాదయాత్ర చేయాలనే కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనకు మెజారిటీ సీమాంధ్ర మంత్రుల నుంచి సానుకూల వైఖరి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి వంటి మంత్రులు మాత్రం వద్దని సలహా ఇస్తున్నారట. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయంలో భాగస్వామియేనని ప్రజలు భావిస్తున్నారని, అందువల్ల ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పే మాటలను విశ్వసించడం కష్టమని ఆనం అన్నారట.
పైగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే పార్టీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష సమరానికి దిగినట్లే అవుతుందని అంటున్నారట. అయితే, పాదయాత్ర చేపట్టడానికే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లు శానససభకు రావడానికి ముందే పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications