వ్యతిరేక గళం: జగన్ పార్టీలో 'రాజన్న దళం'

శనివారం ఒక్కరోజే దాదాపు నాలుగైదు జిల్లాల్లో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. రాజీనామాలు, ముష్టిఘాతాలు, సొంత కుంపటి పేరుతో వేడెక్కించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మోహన్ రెడ్డిపై జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కిష్టప్ప అనుచరులు పార్టీ కార్యాలయంలోనే దాడి చేశారు. దీంతో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పలువురు కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు తరలి వెళ్లారు.
దాడిని నిరసిస్తూ తాను నియోజక వర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోహన రెడ్డి ప్రకటించారు. ఆయనతో పాటే మరికొందరు రాజీనామా చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎప్పటినుంచో పార్టీజెండా మోస్తున్న తమను కాదని, కొత్తగా వచ్చినవారికి పదవులు ఇస్తున్నారంటూ పలువురు నాయకులు పలువురు రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న జిల్లా కన్వీనర్ వెంకటరమణా రెడ్డి ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు.
అయితే సమన్వయకర్తగా సిద్ధార్థ రెడ్డిని నియమించడంతో వెంకటరమణా రెడ్డి గుడ్ బై చెప్పారు. జిల్లా కన్వీనర్ పదవి తనకు దక్కుతుందని భావించిన సాయిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొందరు గుడ్ బై చెప్పారు. తాము జగన్ పట్ల అభిమానంతోనే చేరామని, కానీ ఇప్పుడు ఆ పార్టీలో డబ్బే సమస్తం అయ్యిందని వారు ఆరోపించారు. డబ్బుల మూట చూపిస్తేనే టిక్కెట్లు ఇస్తామనేలా నాయకత్వం వ్యవహరిస్తోందని, జగన్ జైలు నుంచి వచ్చేసరికి పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పార్టీ నుంచి బహిష్కృతులైన నేతలు ప్రత్యేకంగా 'రాజన్నదళం' ఏర్పాటు చేశారు. మేకపాటి సోదరులు ఉదయగిరి నియోజకవర్గంలో తమ ప్రయోజనాల కోసమే తనను సస్పెండ్ చేయించారని జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిరంజీవి రెడ్డి ఆరోపించారు. రాజన్న దళంతో వారి ఆగడాలను అడ్డుకుంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని ప్రకటించారు. పార్టీలో ఇబ్బందులు పడుతున్న నేతలను ఈ దళంలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లాలో ఇంఛార్జి పదవులు దక్కని వారు వేరుకుంపటి పెట్టారు. ఒకవైపు పార్టీ రాష్ట్ర నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం ఏర్పాటు చేయగా.. మరోవైపు అసమ్మతి నేతలు ఓ ప్రైవేటు అతిథిగృహంలో సమావేశమై జిల్లాలో పార్టీ తీరుపై బహిరంగ విమర్శలకు దిగారు. గుంటూరు జిల్లాలో జగన్ పార్టీ ప్రైవేటు కంపెనీలా మారిందని, కేవలం నలుగురి కనుసన్నల్లోనే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందునుంచి ఉన్నవారిని కాదని, కొత్తగా చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ సొంత జిల్లాలోనూ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయంటున్నారు. జగన్ జైలు నుండి విడుదలై వస్తే పార్టీలోని అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చి, అసంతృప్తులను చల్లార్చి పార్టీని ముందుకు తీసుకు వెళ్లగలరని అసంతృప్త నేతలు సైతం భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications