టి 'ముఖ్య'నేత ఎవరు, లోకేష్ యు టర్న్!?

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం, సీమాంధ్ర నేతలు రాజీనామా చేస్తున్నప్పటికీ... తాము విభజనకు వ్యతిరేకం కాదని, తమ ప్రాంత ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నామని ఒకటికి పదిసార్లు స్పష్టంగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో టిడిపి పట్టు పెంచుకుంటోంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టిడిపి ఎక్కువ స్థానాలలో గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అయితే తమకు మరింత మంచిదని వారు భావిస్తున్నారట. అప్పుడు పోటీ కాంగ్రెసు - టిడిపి మధ్యనే ఉంటుందని, తెరాస విలీనం కాకున్నా ఓట్లు చీలుతాయని, తమ ఓట్లు తమకు పడతాయని వారు భావిస్తున్నారు.
తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతంలోను టిడిపి ఆశించిన స్థాయిలో నిలబడుతుందని చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని లీడ్ చేసేదెవరు అనే చర్చ ప్రధానంగా సాగుతోందట. రాష్ట్రం కలిసుంటే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హైదరాబాద్ పరిసరాల్లోని ఓ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. విభజన జరుగుతున్న నేపథ్యంలో దానిపై యూ టర్న్ తీసుకున్నారట.
చంద్రబాబు రెండు రాష్ట్రాలకు జాతీయ నాయకునిగా ఉండి పార్టీని నడిపించాల్సిందే కానీ తెలంగాణలో నాయకత్వం వహించేందుకు టిడిపి బలమైన నాయకుడు లేడని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు క్యూలో ఉన్నారంటున్నారు. అయితే రెండు ప్రాంతాల్లో పార్టీ అధ్యక్షులుగా ఎవరున్నా అధికారం చలాయించేది, ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించేది మాత్రం చంద్రబాబే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications