పార్లమెంటుకు బాలయ్య: అసెంబ్లీకి లోకేష్?

తన వ్యూహరచనలో భాగంగా బాలకృష్ణను హరికృష్ణ స్థానంలో రాజ్యసభకు పంపిస్తారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇదే స్థితిలో మరో వార్త కూడా బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో హిందూపురం లోకసభ స్థానం నుంచి బాలయ్యను పోటీకి దించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ విధంగానైనా రాష్ట్రంలో తన కుమారుడు నారా లోకేష్‌కు పోటీ లేకుండా చూసే పనిలో చంద్రబాబు పడినట్లు చెబుతున్నారు.
కాగా, రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నారా లోకేష్‌ను పార్టీకి పెద్ద దిక్కుగా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. నారా లోకేష్ కృష్ణా జిల్లాలోని పెనమలూరు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు సొంత జిల్లా కృష్ణాలో నందమూరి హవాను తగ్గించేందుకు కూడా అది పనికి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దీన్నిబట్టి నారా లోకేష్‌కు పెనమలూరు ఖాయమవుతుందని అంటున్నారు.
నిజానికి, పెనమలూరు శాసనసభా స్థానం నుంచి బాలయ్య పోటీ చేయాలని అనుకుంటున్నారు. తాను లోకసభకు పోటీ చేయబోనని, శాసనసభకే పోటీ చేస్తానని పలుమార్లు ఆయన చెప్పారు కూడా. అయితే, తానొకటి తలిస్తే చంద్రబాబు మరోటి తలుస్తున్నట్లు తెలుస్తోంది. స్వయానా తన అల్లుడు అయిన నారా లోకేష్ పెనమలూరు నుంచి పోటీ చేస్తానంటే బాలయ్య కాదనే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఏమైనా, నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.












Click it and Unblock the Notifications