జయ కేసు: జగన్ పార్టీ ఎమ్మెల్యేల అలజడి?
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడియంకె అధినేత జయలలిత జైలు పాలు కావడం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కలవరం రేపినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో కొనసాగే విషయంలో వైసిపి శాసనసభ్యులు డైలమాకు గురవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో తమ భవిష్యత్తు కోసం టిడిపిలోకి జంప్ అయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 28 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
అక్రమాస్తుల కేసు జైలుకెళ్లి బయటకు వచ్చిన జగన్ పరిస్థితి భవిష్యత్తులో ఏమవుతుందనే ఆందోళన చోటు చేసుకుంది. ఇప్పటికీ జగన్మోహన్‌రెడ్డిపై సిబిఐ పదకొండు ఛార్జీషీట్‌లను దాఖలు చేసింది. ఏ ఒక్క కేసులో తీర్పు వెనువెంటనే వచ్చినా లేక సుధీర్ఘకాలం పట్టినా తమ భవిష్యత్తుపై అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనేది వైసిపి ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. జయలలిత కేసు పరిణామాలను, రామలింగ రాజు కేసు విచారణ తీరుపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. జగన్ కేసుల విచారణపై కూడా వారు తమకున్న పరిచయాల ద్వారా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
జయలలితపై అక్రమాస్తుల కేసు ఒక్కటే అయినా దీనిపై 18 ఏళ్లపాటు సుధీర్ఘ విచారణ కొనసాగింది. అదే సందర్భంలో సత్యం రామలింగరాజు కేసు కూడా గత ఆరేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల తరహాలోనే తమ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ సాగుతోందా లేక వెనువెంటనే తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది వైసిపి ఎమ్మెల్యేల గుంజాటనగా కనిపిస్తోంది. మొత్తం మీద, జగన్ పార్టీలో జయలలిత కేసుపై వెలువడిన తీర్పు ఆందోళనకు దారి తీసినట్లు మాత్రం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications