పవన్ కళ్యాణ్ పాటతో నారా లోకేష్ ప్రసంగం
అనంతపురం: ఒక దొంగ నాయకుడు హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో లోటస్‌పాండ్ నిర్మించాడని, చెమటోడ్చిన సొమ్మైతే వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కడతాడా? అని, అటువంటి నాయకుడు వైసిపి పెట్టాడని, ఆ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేస్తే ఉరి వేసుకున్నట్లే' అని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యువ ప్రభంజనం యాత్ర సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో శుక్రవారం జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.
'కాటమరాయుడా... కదిరీ నర్సింహుడా' అంటూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో పాడిన పాటతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అదే ఖాద్రీ నృసింహస్వామిని గుర్తు చేసుకున్నారు. '40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం మాది. తాత, నాన్న ముఖ్యమంత్రులుగా పాలించారు. ఎప్పుడైనా తనపై కానీ, తన మేనమామలపై కానీ ఒక్క ఆరోపణ వచ్చిందా' అని ప్రశ్నించారు.

అధికారంలోకి రాగానే డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని, అయితే రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ టీడీపీ మేనిఫెస్టోను కాపీకొట్టడం సిగ్గుచేటన్నారు. రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్‌క్యాన్, ఉచిత ఆరోగ్య కార్డును ఇవ్వబోతున్నామని చెప్పారు. వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు.
24 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి ఇస్తే పదేళ్లలో సీమాంధ్రను సింగపూర్‌గా మార్చకపోతే నడిరోడ్డులో తనను నిలదీయండని పేర్కొన్నారు. తొలుత లోకేశ్ శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం హజరత్ మక్కా ఆలంఖాన్ వలీ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గాలో పూలచాదర్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు లోకేశ్‌కు ఖురాన్‌ను బహూకరించారు.












Click it and Unblock the Notifications