మాతృ ప్రేమ: మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ
చెన్నై: తన కూతురికి మాతృత్వపు ఆనందాన్ని పంచడం కోసం ఓ మహిళ తన గర్భంలో కూతురు కూతురికి జన్మనించ్చింది. 61 ఏళ్ల వృద్ధురాలు తన కన్నబిడ్డ కోసం నవమాసాలు మోసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి.. కూతురి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఆకాష్ వైద్యశాల వైద్యులు ఆమెకు పురుడు పోశారు.
వివరాల్లోకి వెళితే.. టి.నగర్‌కు చెందిన ప్రకాష్ (30), సీతా మహాలక్ష్మి (27) దంపతులకు సంతానం లేదు. లక్ష్మికి గర్భం వచ్చినా ఏడో నెలలో గర్భస్రావం జరిగి.. పిండంతో పాటు గర్భసంచిని తొలగించారు వైద్యులు. ఆ తర్వాత సంతానం కోసం పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. చివరకు అద్దె గర్భం ద్వారా ఆ కలను సాకారం చేసుకోవాలనుకున్నారు.

ఆకాష్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఇతర స్త్రీల అద్దెగర్భం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, బంధువులు ఎవరైనా ఉంటే అనుకూలంగా ఉంటుందని వైద్యులు సూచించారు. ఆ వివరాలను లక్ష్మి తన తల్లికి వివరించింది. అయితే కూతుర్ని అమ్మను చేసేందుకు ఆ అమ్మ గర్భం దాల్చడానికి ఒప్పుకొంది. దీంతో అప్పటికే ఆమెకు రుతుచక్రం ఆగిపోయినా.. వైద్యులు పలు ఔషధాలిచ్చి రుతుచక్రం మళ్లీ వచ్చేలా చేశారు.
ఆ తర్వాత ప్రకాష్ శుక్రకణాలను, లక్ష్మి అండంతో ఫలదీకరించి, వాటిని ఆ ‘అమ్మ కడుపు'లో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల తర్వాత పిండం ఎదుగుదల సక్రమంగానే ఉందని నిర్ధారించిన వైద్యులు, ఆమెను ప్రత్యేక పర్యవేక్షణలో పెట్టారు. ఇటీవలే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చి.. కూతురికి ఇచ్చింది.












Click it and Unblock the Notifications