ఏపీ వరుడికి కేసీఆర్ ఆఫర్: తెలంగాణ అయితే చాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పేదింటి అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని తెలంగాణ రాష్ట్రంలోని అందరికి వర్తింప చేస్తున్నారు. ముస్లీంలకు షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్నారు. ఇక సిక్కులకు తదితరులకు కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
తాజాగా కేసీఆర్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద వధువు తెలంగాణవాసి అయితే, వరుడు సీమాంధ్రుడైనా ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 30 వేల మంది ఎస్సీ వధువులకు సాయమందించాలని నిర్ణయించినా ఇప్పటిదాకా రెండువేల లోపే దరఖాస్తులు వచ్చాయి.

మహబూబ్‌నగర్ జిల్లావాసులు కర్నూలు (ఏపీ), గుల్బర్గా (కర్ణాటక)వాసులతో, నల్గొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగూడ వారు కృష్ణా, గుంటూరు (ఏపీ) జిల్లాలవారితో, ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి, నిర్మల్ ప్రాంతాలవారు మహారాష్ట్ర వాసులతో, మెదక్‌లోనివారు కంగ్డి (కర్ణాటక) ప్రాంతాలవారితో సంబంధ బాంధవ్యాలు నెరపుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల ఎస్సీ వధువులకు సహాయం చేయడం ప్రశ్నార్థకంగా మారింది.
దీనిపై స్థానిక అధికారులు సందేహ నివృత్తి కోరారు. వధువు తెలంగాణకు చెందిన యువతి అయితే చాలని, వరుడు ఏ ప్రాంతంవాడైనా సహాయం అందించవచ్చని ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. మరోవైపు ఎస్టీ, మైనారిటీల విషయంలోనూ ఆ శాఖలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications