ఇరుకున పడేసిన 'మిత్రులు', జగన్‌కు బుక్: ఇంత చేస్తే.. బాబు అసహనం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రనాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డంగా బుక్కయ్యారా? ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్రం పైన తన అసహనం ప్రదర్శిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.
ఇప్పటికే కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా పైన దాదాపు తేల్చేసింది. అవసరమైన నిధులు రాష్ట్రానికి ఇస్తున్నప్పుడు ఇక ప్రత్యేక హోదా అవసరం ఏమిటని నాలుగు రోజుల క్రితం కేంద్రమంత్రి హెచ్‌పీ చౌదరి ప్రశ్నించారు. తద్వారా బిజెపి ప్రత్యేక హోదా దాదాపు ఇవ్వకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కృష్ణా, గోదావరి నదుల పైన ప్రాజెక్టులు కడుతున్నారు. ఏపీకి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటిని కెసిఆర్ తోడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ నేతలు భావిస్తున్నారు.

టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో రెండు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి. మరోవైపు, ఓటుకు నోటు కేసు నేపథ్యంలో బద్ద వ్యతిరేకులుగా మారిన చంద్రబాబు - కెసిఆర్‌లు గత కొద్ది రోజులుగా స్నేహితులుగా మారిపోయారని చెప్పవచ్చు.
విభజన నేపథ్యంలోని ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా, చర్చించి పరిష్కరించుకుందామని ఇరువురు ముఖ్యమంత్రులు చెబుతున్నారు. బిజెపితో స్నేహంగా ఉండి నిధులు, హోదా సాదిధ్దామని చంద్రబాబు భావించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో సామరస్యంగా ఉండాలనుకున్నారు.
కానీ, ఇప్పుడు అదే బిజెపి, కెసిఆర్‌ల చంద్రబాబును పూర్తిగా ఇరుకున పడేశారు. తద్వారా మిత్రులే చంద్రబాబును ఇరుకున పడేశారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దాదాపు తేల్చేసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా - గోదావరి నదుల పైన ప్రాజెక్టుల విషయంలో దూకుడుగా ఉంది.
సమైక్య రాష్ట్రంలో నీటి విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెరాస చెబుతోంది. తమకు జరిగిన అన్యాయాన్ని పూడ్చుకుంటున్నామని, అదే సమయంలో కేవలం తమ వాటానే తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టులు సరికాదని ఏపీ నేతలు భావిస్తున్నారు.
జగన్‌కు అందివచ్చిన అవకాశం
ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ వైసిపి అధినేత జగన్‌కు అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పటికే ప్రత్యేక హోదా పైన ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది రాదని తేలడంతో బిజెపి పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు కేంద్ర కేబినెట్ నుంచి పక్కకు జరిగి కేంద్రానికి హెచ్చరికలు పంపించాలని చాలామంది భావిస్తున్నారు.
జగన్, కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా రాదని తేలినప్పుడు.. టిడిపి కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని, టిడిపి కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాతో జగన్‌కు దొరికిపోయిన చంద్రబాబు తాజాగా.. కెసిఆర్ వల్ల కూడా బుక్కయ్యారని అంటున్నారు.
తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన వైసిపి అధినేత జగన్ నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. జగన్ దీక్షా నిర్ణయం కారణంగా తెలంగాణలో వైసిపి ఖాళీ అయింది. మిగిలిన ఒక్క ఎంపీ, ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. జగన్ కూడా తెలంగాణను పూర్తిగా వదిలేశారు.
ఏపీ ప్రయోజనాల కోసం ఆయన పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే, తెలంగాణలో టిడిపి ఇంకా ఉంది. అదే సమయంలో చంద్రబాబు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరని కూడా అంటున్నారు. ఇప్పుడు కెసిఆర్ కట్టే ప్రాజెక్టులతో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ కట్టే ప్రాజెక్టుల పైన చంద్రబాబుకు నిలదీసే దమ్ములేదని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ఆ భయంతోనే కెసిఆర్‌ను ప్రశ్నించడం లేదని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కారణాలతో చంద్రబాబు పూర్తిగా చిక్కుల్లో పడ్డారని అంటున్నారు.
చంద్రబాబు అసహనం, ఆగ్రహం
ఓ వైపు ప్రత్యేక హోదా పైన కేంద్రం తేల్చి చెప్పడం, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులు, ఇంకోవైపు జగన్ తనను టార్గెట్ చేసుకుంటుండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురైనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన కేంద్రంపై తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారని చెప్పవచ్చు.
సోమవారం చంద్రబాబు మాట్లాడుతూ... కష్టపడి పని చేసే రాష్ట్రాల పైన కేంద్రానికి ఇంత చిన్న చూపా అని మండిపడ్డారు. కేంద్రం తీరు పైన చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చి నిధుల్లోను కోత పెడుతోందని ఆరోపించారు. తమ హక్కులు ఎలాగైనా సాధించుకుంటామని చెప్పారు. అదే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులు ఆపాల్సిన భారాన్ని కూడా కేంద్రం పైన వేశారు. పరస్పర ఆమోదంతో చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications