నేనున్నా, కుప్పం వెనుకబడింది: బాబు, బిల్లు వసూలు చేస్తామని సొంత ఎమ్మెల్యేలకు షాక్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన భగ్గుమన్నారు. ఎమ్మెల్యేలకు ట్యాబ్‌లు ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని పార్టీ యంత్రాంగాన్నని ఆదేశించారు.
టిడిపి అవగాహన శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరానికి హాజరైన వారిలో ఎంతమంది ట్యాబ్‌లు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. చాలా కొద్దిమంది మాత్రమే తెచ్చుకున్నట్లు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే, తెచ్చుకోని వారందరికీ ట్యాబ్‌లు అందించాలని, వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఒక్కో ట్యాబ్ రూ.35వేలు ఉంటుందని ఓ ఎమ్మెల్యే అన్నారు.
మీకు శాసన సభలో ఐప్యాడ్‌లు, ఐఫోన్లు ఇస్తున్నామని, వాటిని ఏం చేస్తున్నారని, మీ పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారా, ఊరికేనే ఎమ్మెల్యేలు అవుతారా, ఆ మాత్రం భరించలేరా అని అసహనం వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల వాడకంపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.
కాగా, టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేఎల్‌యూలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో విజయవాడలోని సెంట్రల్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రం ఇంఛార్జ్ రాజశేఖర్ ఆ కేంద్రం పనితీరుపై అగాహన కల్పించారు.
రియల్ టైం పాలన, డ్యాష్ బోర్డు, కైజాల యాప్‌లు అంటే ఏమిటి, వాటిని పాలనలో ఉపయోగించుకోవడం ఎలా, వాటి వల్ల సౌలభ్యం ఏమిటన్న విషయాలను వివరించారు. ఆధునిక పాలనా వ్యవస్థలో ఇళాంటి వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిపారు.
ఇన్నేళ్లుగా నా కుప్పమే వెనుకబడి ఉంది
తాను ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన నియోజకవర్గమైన కుప్పం ఇంకా వెనుకబడే ఉందని, కొన్ని ప్రాంతాలు చారిత్రకంగా వెనుకబడి ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వాటిని ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. కాగా, తాను ఉన్నప్పటికీ కుప్పం వెనుకబడి ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష వైసిపికి విమర్శలకు అవకాశమిచ్చినట్లే అంటున్నారు.












Click it and Unblock the Notifications