తల నరుక్కుంటానన్నావుగా: మాయా, మీ వాళ్లని పంపండి: స్మృతి
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ మాజీ సీఎం, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మధ్య రాజ్యసభలో మరోసారి వాగ్వాదం జరిగింది. హెచ్‌సియులో విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి స్మృతి ప్రకటనతో తాను తృప్తి చెందలేదని చెప్పారు.
అందువల్ల ఆమె లోగడ చెపినట్లు తలనరుక్కొని తన ముందు పెట్టాలని మాయావతి అన్నారు. రోహిత్ ఆత్మహత్యపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌లో దళిత సభ్యుడిని నియమిస్తారా లేదా అన్న తన ప్రశ్నకు ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదని మాయావతి అన్నారు.
దీనిపై అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాల్‌తో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన అగ్రవర్ణాల వ్యక్తి అన్నారు. దళిత సభ్యుడికి చోటు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అయినా ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు.

రోహిత్ అంశంపై తన సమాధానంతో నేను సంతృప్తి చెందకుంటే తన తల నరికి సమర్పిస్తానని స్మృతి ఇరానీ చెప్పారని, ఆమె సమాధానం తనకు తృప్తినివ్వలేదని, కాబట్టి ఇప్పుడేం చేస్తారని మాయావతి ప్రశ్నించారు.
దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. నా తలను తీసుకురమ్మని మీ కార్యకర్తలను పురమాయించండని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలోని ప్రాక్టోరియల్ బోర్డులో ఎస్సీ సభ్యుడు లేరన్న ఆరోపణలను నిరాధారమన్నారు.
రూపన్‌వాల్ కమిషన్‌పై మాయావతి వ్యాఖ్యలను స్మృతి ప్రస్తావిస్తూ.. మాయావతి సీఎంగా వ్యవహరించిన యూపీలోని అలహాబాద్ హైకోర్టులోనే జస్టిస్ రూపన్‌వాల్ న్యాయమూర్తిగా పని చేశారని చెప్పారు.
మరోవైపు సిపిఎం నేత సీతీరాం ఏచూరీని విమర్శిస్తూ రోహిత్ వేముల ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిపై ఏచూరీ మాట్లాడుతూ... తనను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో రోహిత్ రాసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను స్మృతి ఉదహరించడాన్ని తప్పుపట్టారు.
ఆ ఫేస్‌బుక్ ఖాతా రోహిత్‌దేననడానికి ఆధారాలేంటని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివి వినిపించిన ప్రతి అక్షరాన్నీ వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువపరిచారని చెప్పారు. సదరు పత్రాలను తానూ పరిశీలిస్తానని డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్ హామీ ఇచ్చారు. సీతారాం ఏచూరీ పైన రోహిత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications