హోటల్ స్టైల్ "దూపుడు పోతు బిర్యానీ" ఇంట్లోనే ఎలా చేయాలంటే ??
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలు అంటేనే ఘాటు రుచులు, నాటు వంటకాలు గుర్తొస్తాయి. అలాంటి వంటకాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది "దూపుడు పోతు బిర్యానీ". ఇది సాధారణ మటన్ బిర్యానీకి భిన్నంగా, లేత పొట్టేలు (దూపుడు పోతు) మాంసంతో తయారవుతుంది. చిన్న వయసు మాంసం కావడం వల్ల బిర్యానీ ముక్కలు చాలా మెత్తగా, జ్యూసీగా ఉండటంతో పాటు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి.
దూపుడు పోతు బిర్యానీ ప్రత్యేకత..
ఈ బిర్యానీకి ప్రత్యేకమైన ఆకర్షణ నాటు మసాలాలు, ఎక్కువ నెయ్యి, తక్కువ నీరు, నెమ్మదిగా దమ్ చేయడం. రాయలసీమ వంటకాల శైలిలో కారం కొంచెం ఎక్కువగా ఉండడం.. సువాసన గల దినుసులు వాడడం వల్ల ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక అతిథుల కోసం ఇళ్లలో స్పెషల్ గా చేసే వంటకంగా నిలుస్తోంది. హోటల్ స్టైల్ లో ఇంట్లోనే దూపుడు పోతు బిర్యానీ ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు..
మాంసం & బియ్యం:
1 కేజీ దూపుడు పోతు మాంసం (చిన్న ముక్కలుగా కోసినది)
1 కేజీ బాస్మతి బియ్యం లేదా చిట్టి ముత్యాలు
ఇతర పదార్థాలు:
తగినంత నూనె, నెయ్యి
4 పెద్ద ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి)
4 పచ్చిమిర్చులు
3 టీస్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్
1 కప్పు పెరుగు
బిర్యానీ దినుసులు & మసాలాలు:
బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క
షాజీరా, మరాఠీ మొగ్గ
2 టీస్పూన్లు కారం
½ టీస్పూన్ పసుపు
ధనియాల పొడి, గరం మసాలా (తగినంత)
ఒక్కో కట్ట పుదీనా, కొత్తిమీర
4 టీస్పూన్లు నిమ్మరసం
కుంకుమపువ్వు నానబెట్టిన నీళ్లు
తయారీ విధానం..
మాంసం మ్యారినేషన్ :
- ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, కొద్దిగా నూనె, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని కనీసం 1-2 గంటలు, వీలైతే 4 గంటల వరకు నానబెట్టితే మాంసం మరింత మెత్తగా, రుచిగా మారుతుంది.
బియ్యం సిద్ధం చేసే విధానం :
- బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. ఒక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి అందులో బిర్యానీ దినుసులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నానబెట్టిన బియ్యాన్ని జోడించాలి.
- బియ్యం 70 శాతం ఉడికిన వెంటనే నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. పూర్తిగా ఉడికిపోకుండా జాగ్రత్త అవసరం.
మాంసం వండే ప్రక్రియ :
- అడుగు మందంగా ఉన్న బిర్యానీ పాత్రలో నూనె, నెయ్యి వేడి చేసి బిర్యానీ దినుసులు వేయాలి.
- ఉల్లిపాయలను బంగారు రంగులో వేయించి, అందులో మ్యారినేట్ చేసిన మాంసం వేసి పది నిమిషాలు అధిక మంటపై వేయించాలి.
- ఆ తర్వాత మంట తగ్గించి మూత పెట్టి మాంసం పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. ( దూపుడు పోతు మాంసం కావడంతో త్వరగా ఉడుకుతుంది )
- మాంసం ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర చల్లాలి.
- దానిపై ఒక పొర అన్నం పరచి, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు నీళ్లు చల్లాలి.
- ఇప్పుడు పాత్రను గోధుమ పిండితో లేదా బరువుతో గట్టిగా సీల్ చేసి 15-20 నిమిషాలు సన్నని మంటపై దమ్ పెట్టాలి.
- స్టవ్ ఆపిన తర్వాత మరో 10 నిమిషాలు మూత తీయకుండా ఉంచితే రుచి మరింత పెరుగుతుంది.
వడ్డింపు..
ఇలా తయారైన దూపుడు పోతు బిర్యానీ ఘుమఘుమలాడుతూ, మాంసం ముక్కలు నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. దీనిని మిర్చి కా సాలన్, పెరుగు పచ్చడి లేదా ఉల్లిపాయ రాయితాతో వడ్డిస్తే రుచి అమృతంలా ఉంటుంది.












Click it and Unblock the Notifications