ఇయర్‌ఫోన్స్ - ఇయర్‌బడ్స్ రెగ్యులర్ గా వాడుతున్నారా..!?
చాలామంది హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్‌ను వాడేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇయర్ ఫోన్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రయాణాల్లో.. ఖాళీ సమయాల్లో ఇయర్ ఫోన్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. హెడ్‌ఫోన్స్ అయినా, ఇయర్‌బడ్స్ అయినా.. సక్రమంగా వాడితేనే వాటివల్ల ఎదురయ్యే దుష్ప్రభవాల నుంచి బయటపడవచ్చు. వీటి ఉపయోగంలో ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించి నా.. అవి వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినికిడి వరకే కాదు.. నరాల వ్యవస్థ పైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఇయర్‌బడ్స్ నేరుగా చెవుల్లో అమరిపోతాయి. దీంతో శబ్ద తరంగాలు.. చెవిపొరకు చాలా దగ్గరై ప్రభావం చూపుతాయి. ఎక్కువ సమయం, అధిక శబ్దంతో వినడం వల్ల వినికిడి శక్తి తగ్గడం, చెవుల్లో చికాకుగా అనిపించడం(టిన్నిటస్), అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు వంటివి సమస్యలు తలెత్తే అవకాశముంది. అలాగే బయటి శబ్దాలు వినిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది తెలియకుండానే వాల్యూమ్‌ను పెంచేస్తుంటారు. ఇది చెవులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి నియంత్రిత వాల్యూమ్‌ను దాటకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాగా, ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్.. చెవులకు బయటి భాగంలో ఉంటాయి. ఇవి చెవిపొరకు కొంత దూరంలో ఉండటంతో శబ్ద ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండటంతో చుట్టూ ఎక్కువ శబ్దం ఉన్నా వాల్యూమ్‌ను అధికంగా పెట్టాల్సిన అవసరం అంతగా ఉండదు.

నిపుణుల సూచనలు
కాబట్టి ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే హెడ్‌ఫోన్స్ కొంత వరకు సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పరికరమైనా అధిక శబ్దంతో, ఎక్కువసేపు వినియోగిస్తే వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చెవి లోపలి భాగంలోని సూక్ష్మ కేశ కణాలు దెబ్బతింటే అవి మళ్లీ ఏర్పడవు. అందుకే శబ్ద స్థాయిని నియంత్రించడం అత్యంత అవసరం. వినికిడి సమస్యలు ఒక్కసారిగా కాకుండా క్రమంగా ప్రభావం చూపుతాయి. మాట్లాడే సమయంలో ఇబ్బందులు, చెవుల్లో చికాకు లేదా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించే వరకు చాలామందికి ఈ సమస్య ఉన్న విషయం తెలియదు. అయితే.. ఇయర్ ఫోన్స్ ను ఎక్కువ సమయం వాడడం వల్ల చెవిలో నిరంతరం లాగుతున్నట్టు, మోగుతున్నట్టు లేదా ఏదో తెలియని శబ్దం వినబడినట్టు ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం రోజుకు 2 గంటలకు పైగా ఇయర్ ఫోన్స్ వాడే వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కనుక ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడే వారు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.













Click it and Unblock the Notifications