ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటున్నారా?
నేటియువత ఎనర్జీ డ్రింక్స్ ను విపరీతంగా తాగుతోంది. ఒకరకంగా అలా తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. కూల్ డ్రింక్స్ బదులుగా వీటిని తాగుతున్నారు. ఇవి తాగిన తర్వాత ఒక కొత్త శక్తి వచ్చినట్లుగా అనుభూతి చెందుతున్నారు. దీనివల్లే వీటి అమ్మకాలు జోరుమీదున్నాయి. వీటిని ఎక్కువగా తాగడంవల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయి. తాగేవారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవి ఎక్కువగా తీసుకోవడంవల్ల ఎటువంటి నష్టాలున్నాయో తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్ లో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఒకసారి ఎనర్జీ డ్రింక్‌కి బానిసలైతే అప్పటి నుంచి క్రమక్రమంగా శారీరక స్థితి క్షీణిస్తుంది. వీటిని తాగడంవల్ల తీసుకునే ఆహార విధానంలో కూడా ప్రభావం ఉంటుంది. వీటిల్లో చక్కెర శాతం చాలా ఎక్కువ. ఎనర్జీ డ్రింక్‌లో దాదాపు 13 టీస్పూన్ల చక్కెర ఉంటుంది.ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇలా పెరగడం చాలా ప్రమాదకరం. తరుచుగా వీటిని తాగుతుండటంవల్ల నిద్రలేమి కలుగుతుంది. నిరంతరం ఎనర్జీ డ్రింక్స్ తాగే వ్యక్తులు నిద్ర సరిగా పట్టడం లేదని తరుచుగా ఫిర్యాదు చేస్తుంటారు.

శరీరంలోని చాలా భాగాలు ఒత్తిడికి లోనవుతాయి. దీని కారణంగా రోజువారీ చేసే పనినే సరిగా చేయలేని స్థితికి చేరుకుంటారు. అంతేకాకుండా పలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శరీరంలో సెరోటోనిన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల డిప్రెషన్, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వీటిని తీసుకోవడం వల్ల లాభమే గానీ ప్రతిరోజు తాగుతుండటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications