రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. వీటితో చెక్, ఇక హాయిగా..!!
చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఫోన్ లను ఎక్కువగా ఉపయోగించడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు. అదే సమయంలో తీసుకొనే ఆహారం సైతం నిద్ర పైన ప్రభావం చూపిస్తుంది. రాత్రి నిద్రకు సహాయం చేసే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ గురించి నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టి.. ప్రశాంతమైన నిద్ర సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
రాత్రి సమయంలో మంచి నిద్ర కావాలంటే మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలని. గాఢ నిద్రకు మేలు కొన్ని ఆహార పదార్ధాలు ఉన్నాయి. వాటిల్లో బాదంపప్పు ఒకటి. దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన నిద్రకు, విశ్రాంతికి తోడ్పడే ఖనిజం. సాయంత్రం 5 నుండి 7 గంటల సమయంలో నానబెట్టి తొక్క తీసిన బాదంపప్పును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో మేల్కొనడం తగ్గడంతో పాటు నాణ్యమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. అరటిపండ్లు కూడా నిద్రపోవడానికి ఉపకరిస్తాయి. భోజనం తరువాత లేదా రాత్రి భోజనం తరువాత అరటిపండును తీసుకోవడం వల్ల తగినంత విశ్రాంతిని పొందవచ్చు. ఇక నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల సహజంగా ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తీసుకోవడం వల్ల తక్కువ నిద్ర ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

జీవనశైలి.. ఆహారపు అలవాట్ల మార్పుతో మంచి నిద్ర
కాగా, నిద్రకు ఉపయోగపడే మరో ఆహారం చెర్రీలు. ఇవి శరీరాన్ని చల్లబరిచే శక్తిని కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. సాయంత్రం సమయం లో తాజా చెర్రీపండ్లను తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో సహజంగా నిద్ర వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇటువంటి ఆహారాలను తీసుకుంటూనే జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాలి. రాత్రిపూట స్క్రీన్ వాడకాన్ని తగ్గించడం, కెఫిన్ ను తక్కువగా తీసుకోవడం, రాత్రి సమయంలో ఆలస్యంగా భారీ భోజనాలు చేయడాన్ని తగ్గించడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం వంటి వాటిని పాటించడం వల్ల సహజంగా నిద్రను సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒకే సమయానికి నిద్రించడం, మేల్కొవడం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఇలా తగిన ఆహారాన్ని తీసుకుంటూ, చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల నిద్ర సమస్యల నుండి సహజంగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications