ఇంట్లోనే "మ్యాంగో ఐస్‌క్రీమ్" ఎలా చేసుకోవాలంటే..?
వేసవి కాలంలో మామిడి పండ్లతో చేసే వంటకాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా చల్లచల్లగా తినే మామిడి ఐస్ క్రీమ్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. బయట కొనుగోలు చేసే ఐస్ క్రీమ్‌లలో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో చాలా సులభంగా, రుచికరంగా క్రీమీ మామిడి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో తయారు చేయడం వల్ల పూర్తిగా హైజీనిక్ గా ఉంటుంది. అలానే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండకుండా పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వేసవిలో శరీరానికి చల్లదనం అందిస్తుంది. వీటితో పాటు మామిడి పండ్ల సహజ రుచి పూర్తిగా ఆస్వాదించవచ్చు. తక్కువ పదార్థాలతో, ఎలాంటి ఐస్ క్రీమ్ మెషిన్ అవసరం లేకుండా కేవలం కొన్ని స్టెప్స్‌లో ఈ రెసిపీ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం...

కావలసిన పదార్థాలు..
- ఫుల్ ఫ్యాట్ పాలు - అర లీటర్
- పంచదార - 1/3 కప్పు
- మామిడి ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
- (లేదంటే కార్న్ ఫ్లోర్ వాడవచ్చు)
- అల్ఫోన్సో లేదా తీయని మామిడి పండ్లు - 2
- జీడిపప్పు - 10 నుంచి 12
- ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు (ఐచ్చికం)
- వెనిల్లా ఎసెన్స్ - కొన్ని చుక్కలు (ఐచ్చికం)
- డ్రై ఫ్రూట్స్ - అలంకరణ కోసం
- మామిడి ముక్కలు - కొద్దిగా
తయారీ విధానం..
- ముందుగా ఒక గట్టి అడుగు ఉన్న పాన్ తీసుకుని అర లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను పోయాలి. ఇందులోంచి పావు కప్పు పాలను వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- మిగిలిన పాలను మధ్యమధ్యలో కలుపుతూ నెమ్మదిగా మరగబెట్టాలి. పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులో పంచదార వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి.
- ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ కలపాలి.
- మరో 3 నుంచి 5 నిమిషాలు ఉడికిస్తే పాలు మరింత చిక్కగా మారతాయి. ఈ దశలో కావాలంటే కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ లేదా ఫ్రెష్ క్రీమ్ కూడా కలపవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- తీయగా, పండిన అల్ఫోన్సో మామిడి పండ్లను తీసుకుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక మిక్సీ జార్‌లో ముందుగా జీడిపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది ఐస్ క్రీమ్‌కు రిచ్, క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది.
- ఆ తర్వాత మామిడి ముక్కలు వేసి నునుపైన ప్యూరీలా తయారు చేయాలి. మరింత రుచికోసం కొద్దిగా తేనె లేదా కండెన్స్‌డ్ మిల్క్ కూడా కలుపుకోవచ్చు.
- ఇప్పుడు చల్లారిన కస్టర్డ్ పాల మిశ్రమాన్ని మామిడి ప్యూరీలో కలపాలి. ఈ రెండింటినీ మిక్సీలో పల్స్ మోడ్‌లో కొన్ని సార్లు తిప్పాలి.
- మిశ్రమం స్మూత్‌గా, క్రీమీగా మారిన తర్వాత రుచి చూసి అవసరమైతే మరికొంత పంచదార పొడి కలపవచ్చు.
- ఈ దశలో చిన్న మామిడి ముక్కలు కలిపితే ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు ఫ్రూటీ ఫ్లేవర్ మరింత బాగుంటుంది.
- తయారైన ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని చిన్న బౌల్స్‌లో లేదా కుల్ఫీ మోల్డ్స్‌లో పోయాలి.
- పైన డ్రై ఫ్రూట్స్, మామిడి ముక్కలు చల్లి అలంకరించాలి. తరువాత అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ కవర్‌తో గట్టిగా మూసేయాలి.
- ఇవన్నీ డీప్ ఫ్రీజర్‌లో కనీసం 9 నుంచి 10 గంటల పాటు ఉంచాలి.
- మధ్యలో ఒకసారి బయటకు తీసి కలిపి మళ్లీ ఫ్రీజ్ చేస్తే మరింత క్రీమీ టెక్స్చర్ వస్తుంది.
సర్వింగ్ టిప్స్..
పూర్తిగా గడ్డకట్టిన తర్వాత ఐస్ క్రీమ్‌ను స్కూప్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.
పైగా మామిడి సిరప్, తేనె, చాక్లెట్ చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications