పరోటాలతో బహుపరాక్.. !!
పరోటా అంటే ఇష్టపడనివారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది దీన్ని చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రెడీమేడ్ గా కూడా లభిస్తుంటాయి. పరోటా- ఆమ్లెట్ కాంబినేషన్ అదుర్స్. రాత్రివేళ ఓ పరోటా, అందులో ఓ ఆమ్లెట్ వేసుకుని తింటే ఇక మరేమీ అవసరం ఉండదు. ధాబాల్లో ఎక్కువగా లభిస్తుంటాయి పరోటాలు. అవి లేని ధాబాలు బహుశా ఉండవు. నేటి జీవనశైలిలో రెడీమేడ్ ఫుడ్ అలవాటు పడటం వల్ల దీనికి మంచి ఆదరణ ఉంటోంది.
నిజానికి- పరోటాల్లో క్యాలరీలు అధికం. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరమే. పరోటా ప్రమాదకరంగా మారడానికి మైదానే ముఖ్య కారణం. బేకరీలలో మైదా వాడినా, పరోటాలో ట్రాన్స్‌ఫ్యాట్లున్న నూనెతో పిండి కలపడం మరింత హానికరంగా మారుతుందది. దీనిలో ఫైబర్, ప్రొటీన్ అసలు ఉండవు. అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. ఇవి జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మైదాను మితంగా తీసుకోవాలి.

చపాతీ, కాయిన్ పరోటాలు వంటివి లభిస్తాయి. మధ్యస్థ పరోటా (85 గ్రాములు) 245 క్యాలరీలు, కాయిన్ పరోటా (45 గ్రాములు) సగం క్యాలరీలు కలిగి ఉంటుంది. అధిక పరోటా తినడం వల్ల మధుమేహం, వాపులు, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది. నాన్ వెజ్, ఆమ్లెట్ వంటి అధిక క్యాలరీలు గల కూరలతో కలిపి తింటే క్యాలరీలు మరింత ఎక్కువగా పెరుగుతాయి.
ఈ నేపథ్యంలో పరోటాల సంఖ్యపై జాగ్రత్త వహించక తప్పదు. ఊబకాయులు, డైట్‌లో ఉన్నవారు, రోగులు ఒక పరోటాకు మాత్రమే పరిమితం కావాలి. కరకరలాడే పరోటాలు ట్రాన్స్‌ఫ్యాట్లతో వేయించినవి కావడం వల్ల ఆరోగ్యానికి అత్యంత హానికరం. ట్రాన్స్‌ఫ్యాట్‌ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు పరోటాను ప్రధాన భోజనంగా తీసుకోకండి. ముందు ఏదైనా తిని, తర్వాత దానికి తోడుగా పరోటాను తీసుకోండి.
పగటిపూట పని చేస్తుంటాం కాబట్టి ఆ సమయంలోనే పరోటాలను తినడం మంచిది. రాత్రి 6 గంటల తర్వాత దీనిని మానుకోవడం మంచిది. పరోటాలో ఫైబర్ ఉండదు. కాబట్టి ఉల్లిపాయలు, సలాడ్‌లు, పీచున్న పండ్లను ఎక్కువగా తినండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఒక పరోటాకు సగం ఉల్లిపాయతో పాటు, కాయిన్ పరోటా అయితే రెండు తీసుకోవచ్చు.
పరోటాలతో కలిపి తినడానికి నాన్‌వెజ్ ఫ్రై బదులు గ్రేవీ కూరలు ఎంచుకోండి. తిన్నాక వెంటనే విశ్రాంతి తీసుకోకూడదు. కొంత నడవాలి. దీన్ని తినేటప్పుడు బాగా నమలాలి. నెమ్మదిగా నమిలి తినండి. పరోటా కన్నా కూర-సలాడ్ ఎక్కువిగా తీసుకోండి. వారంలో ఒక్క రోజు మాత్రమే పరోటా తినండి, అది ఆకలికి కాకుండా కోరిక తీర్చుకోవడానికి మాత్రమే.












Click it and Unblock the Notifications